
‘మధ్యాహ్న’ వంటకు గ్యాస్
స్కూళ్లలో ఇలా..
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. వంట బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించారు. జిల్లాలో పాఠశాలకో ఏజెన్సీ చొప్పున 747 ఏజెన్సీల్లో 1290మంది మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేస్తున్నారు. నెలకు 66,953 కిలోల సన్నబియ్యం సరఫరా అవుతున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.14లక్షల వరకు, ఏడో తరగతి వరకు రూ.10లక్షల బడ్జెట్ మంజూరవుతోంది. తొమ్మిది, 10వ తరగతి విద్యార్థులకు రూ.10.67 చొప్పున చెల్లిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వంట పాత్రలకు రూ.63లక్షలు మంజూరు చేయగా.. అన్నం గిన్నెలు, స్టీలు బకెట్లు, గరిటెలు తదితర పాత్రలు కొనుగోలు చేశారు. వంటగది లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఒకే గదిలో స్టోర్‌రూం, వంటపొయ్యి(కట్టెల పొయ్యి) ఏర్పాటుతో పొగ బయటకు రాక ఊపిరిసలపని పరిస్థితి. మన ఊరు–మన బడి కింద చేపట్టిన 27 పనుల్లో 11 పూర్తి కాగా 16 పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మిగతా పాఠశాలల్లో రేకుల షెడ్ అనువుగా లేకపోవడంతో ఆరుబయటే వంట చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వంట గదుల నిర్మాణంతోపాటు నెలకు అవసరమైన సిలిండర్లు సరఫరా చేయాలని వంట నిర్వాహకులు కోరుతున్నారు.
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ నిర్వాహకులకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఏళ్ల క్రితం వంటపాత్రల స్థానంలో నాణ్యతతో కూడిన కొత్త పాత్రలు అందించిన ప్రభుత్వం ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ల మంజూరుపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీని ఉపయోగించి మాత్రమే వంట చేయాలని సూచించింది. వర్షాకాలంలో కట్టెలు ఉపయోగించి భోజనం తయారు చేయడంలో వంట ఏజెన్సీలకు ఎన్నో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఆరుబయట కట్టెలతో వంట చేయడం వల్ల ఆహారం నాణ్యత, రుచి ప్రభావం కావడమే కాకుండా పొగ పీల్చడం, అపరిశుభ్రమైన పరిస్థితుల కారణంగా వంట చేసే వారు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో వంట ఏజెన్సీల పేరిట ఎల్‌పీజీ కనెక్షన్ల జారీకి చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. గ్యాస్ కనెక్షన్ల మంజూరు ఆగస్టు 15లోపు పూర్తి చేయాలని డీఈవో, డీఆర్‌డీవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
అన్ని పాఠశాలలకు..
మధ్యాహ్న భోజనం ఆరంభంలో 747 పాఠశాలల్లో 71 బడులకు మాత్రమే గ్యాస్ పంపిణీ చేశారు. వీటిలో బెల్లంపల్లి మండలంలో 28, కాసిపేట 4, మందమర్రి 8, చెన్నూర్ 14, జన్నారం 8, తాండూర్ మండలంలో 9 పాఠశాలలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేశారు. మొదట్లో గ్యాస్ సరఫరా చేసినా ఆ తర్వాత అటకెక్కాయి. మిగతా పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్, పొయ్యిల పంపిణీ విస్మరించారు. దీంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ పొగతో కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని వంట కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
సిలిండర్ సరఫరా ఎలా..
గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా నెల నెలా సిలిండర్ సరఫరా చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. నెలకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయో తెలియదు. వంట ఏజెన్సీ నిర్వాహకులే కొనుగోలు చేయాలంటే ఆర్థికభారం తప్పేలా లేదు. ఏజెన్సీలకు చెల్లించేది అంతంత మాత్రమే కావడంతో సిలిండర్ల కొనుగోలుకు విముఖ వ్యక్తమవుతోంది. ఉచితంగా సరఫరా చేయకుంటే మళ్లీ మొదటికొచ్చి కట్టెలపొయ్యే దిక్కయ్యేలా ఉంది.
మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు గ్యాస్ కనెక్షన్లు
సర్కారు బడుల్లో ఆగస్టు 15లోపు పూర్తికి చర్యలు
జిల్లా అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు