● కుళ్లిన మాంసంతో చేపల పెంపకం
● ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం
● మామూళ్ల మత్తులో అధికారులు
● ఉమ్మడి ఇటిక్యాలలో వందల ఎకరాల్లో చేపల సాగు
ఇటిక్యాల: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనే దురుద్దేశంతో కొందరు అక్రమార్కులు చేపల చెరువులను సాగుచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిన కోడిగుడ్లు, కోడిపేగులు, ఈకలు, కుళ్లిన మాంసం, చనిపోయిన ఇతర జంతువులను సైతం చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని తిమ్మాపురం, సాసనూలు, కొండేరు, జింకలపల్లి, మొగిళిరావులచెర్వు, షేక్‌పల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా వందల ఎకరాల్లో చేపల సాగును చేపట్టారు. చేపలకు మేతగా వేరుశనగచెత్త, తవుడు, సోయాబీన్ మిలెడ్‌లను వాడాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపలకు కుళ్లిన కోడిగుడ్లతో పాటుగా కోళ్ల వ్యర్థాలను మేతగా వేస్తున్నారు. పట్టపగలే ఆటోలు, వ్యాన్లలో కోళ్ల వ్యర్థాలను కర్నూలు, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా చేపల చెరువులకు తరలిస్తున్నారు. స్థానిక గ్రామాల ప్రజలతో పాటు చేపల చెరువులకు చుట్టు పక్కల వ్యవసాయ పంటలు సాగు చేస్తున్న రైతులు సైతం కుళ్లిన కంపును భరించలేక చర్యలు తీసుకోవాలని పలుమార్లు సంభందిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


