కాన్పు అనంతరం బాలింత మృతి | - | Sakshi
Sakshi News home page

కాన్పు అనంతరం బాలింత మృతి

Jun 9 2026 8:52 AM | Updated on Jun 9 2026 8:52 AM

వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా?

ఆస్పత్రి ఎదుట యువతి బంధువుల

ఆందోళన

నారాయణపేట: వైద్యుల నిర్లక్ష్యం వలనే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఆందోళన దిగిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

కాన్పు కోసం వెళ్లి.. ప్రాణాలు పోయిన వైనం

మండలంలోని పేరపల్లి గ్రామానికి చెందిన నవనీత (25)కు బండగొండ గ్రామానికి చెందిన నరేష్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. మొదటి కాన్పు ప్రభుత్వ ఆస్పత్రిలో సాఫీగా జరిగి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాలుగేళ్ల అనంతరం మళ్లీ గర్భం దాల్చిన నవనీత ప్రతి నెలా కరుణ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ వచ్చింది. ఈ నెల 5న సాధారణ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లగా, రక్తస్రావం జరుగుతుందని గుర్తించిన వైద్యులు వెంటనే సిజేరియన్‌ చేయాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం శస్త్రచికిత్స నిర్వహించగా మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

రక్తస్రావం ఆగకపోవడంతో పరిస్థితి విషమం..

సిజేరియన్‌ అనంతరం నవనీతకు రక్తస్రావం ఆగకపోవడంతో పరిస్థితి క్రమంగా విషమించిందని కు టుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాదాపు పది యూనిట్ల రక్తం ఎక్కించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదన్నారు. గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు పెరగడం వల్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించాలని సూచించినట్లు తెలిపారు. మొదట మహబూబ్‌నగర్‌లోని మారుతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం నవనీత మృతి చెందింది.

వైద్యుల నిర్లక్ష్యమే అంటూ ఆగ్రహం..

నవనీత మృతి వార్త గ్రామానికి చేరుకోవడంతో పేరపల్లి, బొమ్మపాడు గ్రామాలకు చెందిన యువకులు, బంధువులు రాత్రి కరుణ ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. సరైన చికిత్స అందించడంలో వైద్యులు విఫలమయ్యారని, నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం బలైందని ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి వివరణ ఇవ్వకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు

ఆందోళన విషయం తెలుసుకున్న నారాయణపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు అధికారికంగా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.

డాక్టర్స్‌ అసోసియేషన్‌తో చర్చలు

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆస్పత్రి యాజ మాన్యం డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల ద్వారా చర్చలు జరిపి నట్లు సమాచారం.ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత పూర్తిస్థాయి విచారణ జరిగే అవకాశం ఉంది.

తల్లిలేని ఇద్దరు చిన్నారులు

నాలుగేళ్ల కుమార్తెతో పాటు పుట్టిన కొద్ది రోజులే అయిన నవజాత శిశువు ఇద్దరూ తల్లిలేని అభాగ్యులయ్యారు. పుట్టిన చంటిబిడ్డను చూసిన ఆనందం కుటుంబంలో నిలవకముందే ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement