దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయానికి కొత్త ఊపు | - | Sakshi
Sakshi News home page

దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయానికి కొత్త ఊపు

Jun 9 2026 8:52 AM | Updated on Jun 9 2026 8:52 AM

పేట వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జయచంద్రమోహన్‌

నారాయణపేట/మక్తల్‌: విత్తనం రైతు భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.. అదే విత్తనం దేశీయంది అయితే ప్రకృతి వ్యవసాయానికి బలమైన పునాది అవుతుంది. ఈ ఆలోచనతో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలో దేశీ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి రైతుల్లో సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నామని డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ భారతి, సత్య దర్శనం ఫౌండేషన్ల సహకారంతో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ ఆధ్వర్యంలో మక్తల్‌ మండలం బోందల్‌కుంట గ్రామంలో దేశీ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రైతులకు నాణ్యమైన దేశీ విత్తనాలను అందించడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడం ద్వారా సుస్థిర వ్యవసాయానికి బాటలు వేయాలని ఆకాంక్షించారు. అదే విధంగా సుభిక్ష అగ్రి ఫౌండేషన్‌, నారాయణపేట జిల్లా మండల వ్యవసాయ అధికారులు, అమాలిక ఎఫ్‌పీఓ, బీటీఎం ఫౌండేషన్లు భాగస్వాములై మాట్లాడారు. రైతులకు దేశీ విత్తనాల ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలపై అధికారులు వివరించారు. ప్రస్తుతం పెరుగుతున్న సాగు వ్యయాలు, నేల శక్తి క్షీణత, రసాయనాల అధిక వినియోగం వంటి సమస్యలకు ప్రకృతి వ్యవసాయం సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. దేశీ విత్తనాలు స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలకడైన దిగుబడులు అందించడమే కాకుండా రైతుల విత్తన స్వావలంబనకు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సుదర్శన్‌, గణేష్‌ రెడ్డి, గ్రామ భారతి ప్రతినిధులు శివకుమార్‌, సత్యనారాయణ, ఉపేందర్‌, సుభిక్ష అగ్రి ఫౌండేషన్‌ ప్రతినిధి ఉమేష్‌, బీటీఎం ఫౌండేషన్‌కు చెందిన సోఫి, కురుమయ్య, సుధీర్‌, శ్యామ్‌, బాలకృష్ణ రెడ్డి, అశోక్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement