సఖి కేంద్రంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

సఖి కేంద్రంపై విచారణ

Jun 9 2026 8:52 AM | Updated on Jun 9 2026 8:52 AM

మహిళ అదృశ్యంపై ఆగ్రహం

పనిచేయని సీసీ కెమెరాలు

సిబ్బంది పనితీరుపై విస్మయం

గద్వాల క్రైం: భద్రత లేని సఖి కేంద్రం కథనం ఈ నెల 4న సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌ నేరుగా స్పందించారు. సో మవారం జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్‌ను స్వయంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో సిబ్బంది విధుల నిర్వహణ విషయంలో పూర్తిస్థాయిలో అలసత్వం వహించినట్లు బహిర్గతం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 1న గట్టు మండలానికి చెందిన ఓ మహిళ సఖి సెంటర్‌ నుంచి అదృశ్యమైన విషయం మూడు రోజులు గోప్యంగా ఉంచారు. మహిళ అదృశ్యమైన విషయాన్ని సాక్షి దినపత్రికలో ప్రచురించడం తెలిసిందే.

పని చేయని సీసీ కెమెరాలు..

సఖి సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించేందుకు కలెక్టర్‌ వాకబు చేయగా చేదు అనుభవం ఎదురైంది. కొన్ని రోజులుగా మరమ్మతుకు గురైనట్లు సిబ్బంది ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాధ్యత లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, బాధింపబడిన మహిళల విషయంలో ఎంత మేర విధులు నిర్వహించారనేది తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సఖి తరఫున సంరక్షించిన కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, పోలీసు శాఖ రెఫర్‌ చేసిన కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. సఖి నిర్వాహకులు తీసుకోవాల్సిన కేసులు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో సిబ్బంది తమ పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు. లేని పక్షంలో ఉద్యోగం నుంచి తొలగించి అర్హులైన వారిని ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement