వెల్డింగ్ సిలిండర్ పేలి వృద్ధుడు మృతి
బిజినేపల్లి: వెల్డింగ్ గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన అమీర్‌ఖాద్రి (76) కొన్నేళ్లుగా ఇంటి వద్ద గ్యాస్ వెల్డింగ్ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ప్రమాదవశావత్తు వెల్డింగ్ సిలిండర్ పేలి గాయాలపాలయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
దేవరకద్ర: లారీ బైక్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మండలంలోని డోకూర్ శివారులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన సాలె బాల్‌రాజు (35) బ్యాంకు పని నిమిత్తం బైక్‌పై దేవరకద్రకు వచ్చాడు. పని ముగించుకొని తిరిగి కౌకుంట్లకు వెళ్తుండగా డోకూర్ శివారులోని కస్తూర్బా పాఠశాల రోడ్డు మలుపు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
బావిలో పడి
వ్యక్తి మృతి
తెలకపల్లి: బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేశ్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని చిన్నముద్దునూరు గ్రామానికి చెందిన గుండాల బాలకిష్టయ్య(51) ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రతిరోజు రాత్రి పడుకొని ఉదయం ఇంటికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గుడి వద్దకు వెళ్లాడు. సోమవారం ఉదయం ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు దేవాలయం పరిసర ప్రాంతాల్లో వెతకగా ఆవరణలోని బావిలో శవమై కనిపించాడు. మృతుడి భార్య తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ఎస్‌ఐ పేర్కొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
జడ్చర్ల: మండల పరిధిలోని అల్వాన్‌పల్లిలో వాడ్యాల బాలయ్య (55) సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. భార్య వెంకటమ్మ ఆవంచలోని తన చెల్లెలు వద్దకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న జంగయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


