పోస్టల్ బ్యాలెట్ వద్దులే..
● ఓటు గోప్యత లేక జంకుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పోస్టర్ బ్యాలెట్ అంటేనే పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది జంకుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, స్టేజ్–2, ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ అధికారులు, బందోబస్తులో పాల్గొనే పోలీసులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్‌ను జారీ చేస్తుంది. దీనిని ఉపయోగించుకుని వారు తమకు నచ్చినవారికి పెన్నుతో టిక్ చేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన తర్వాత అది సంబంధిత గ్రామ పంచాయతీ స్టేజ్–2 ఆఫీసర్‌కి ఓట్ల లెక్కింపు కంటే ముందు అందజేస్తారు. సదరు పోస్టల్ బ్యాలెట్‌ను తెరిచి అభ్యర్థులకు చూపిస్తారు. తనకు ఓటుపడిన అభ్యర్థికి సంతోషంగా ఉన్నా, ఓటు పడని అభ్యర్థులు ఆ ఉద్యోగిపై కక్షగట్టి, గొడవలు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెటుకు దరఖాస్తు చేసు కోవడానికి జంకుతున్నారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ రహస్యతకు భంగం వాటిల్లకుండా ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక పోలింగ్ బూత్ పెట్టాలని, ఓట్ల లెక్కింపు కంటే ముందే అందరి ఓట్లలో ఇవికూడా కలపాలని కోరుతున్నారు.


