శంకరాయపల్లి తం(టా)డా!
65 ఓట్లతో గ్రామ పంచాయతీ ఏర్పాటు
● ఊరంతా బీసీలే.. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు..
● 8 వార్డులకు 4 వార్డులు ఎస్టీ రిజర్వుడు
● 4 వార్డులకే ఎన్నికల నిర్వహణ
జడ్చర్ల టౌన్: రాష్ట్రంలోనే అతిచిన్న గ్రామపంచాయతీగా జడ్చర్ల మండలంలోని శంకరాయపల్లి తండా పంచాయతీ రికార్డుల్లోకి ఎక్కనుంది. మూడో విడతలో ఎన్నికలు జరగనున్న జడ్చర్ల మండలంలో మొత్తం 45 జీపీలుండగా శంకరాయపల్లి తండా పంచాయతీ ప్రత్యేకంగా నిలవనుంది. పంచాయతీలో మొత్తం 87మంది జనాభా ఉండగా కేవలం 65మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. జీపీలో మొత్తం 8 వార్డులుగా విభజన చేశారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. వార్డుల విషయానికి వస్తే ఎస్టీ మహిళ (2), ఎస్టీ అన్‌రిజర్వుడు (2), అన్‌రిజర్వుడు మహిళ (2), అన్‌రిజర్వుడు (2) వార్డుస్థానాలుగా కేటాయించారు. వాస్తవానికి గ్రామంలో ఉన్నది మొత్తం యాదవకులానికి చెందిన బీసీలే కావటం గమనార్హం. ఈ కారణంగా సర్పంచ్ స్థానంతోపాటు 4వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో అవి ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో కేవలం 4వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సగం మందికే ఓటువేసే అవకాశం
గ్రామంలో 65మంది ఓటర్లు ఉండగా.. ఒక్కో వార్డులో 8మంది ఓటర్లు ఉన్నారు. ఒక వార్డులో మాత్రం 9మంది ఓటర్లకు అవకాశం కలిగింది. మొదటి నాలుగు వార్డులు ఎస్టీ రిజర్వుడు కేటాయించారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళ కావటం, ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎస్టీ ఓటర్లు లేరు. ఈ కారణంగా మిగిలిన 5, 6, 7, 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. దీంతో గ్రామంలో 65మంది ఓటర్లు ఉన్నప్పటికీ కేవలం 32మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గ్రామ పంచాయతీగా మారినప్పటికీ ఓటు వేసే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో మరెక్కడా లేదనడంలో సందేహం లేదు.
బీసీ ఓటర్లయినా.. బీసీ స్థానాలు శూన్యం
గ్రామ పంచాయతీలో ఉన్నది మొత్తం బీసీ ఓటర్లే.. అయినప్పటికీ ఒక్క వార్డు స్థానం కూడా బీసీ రిజర్వుడుగా కేటాయించబడలేదు.
శంకరాయపల్లి వ్యూ
అధికారుల తప్పిదం
2018లో అధికారులు చేసిన తప్పిదం శంకరాయపల్లి తండా పంచాయతీకి శాపంగా మారింది. పంచాయతీ పేరు శంకరాయపల్లి తండా అయినప్పటికీ ఉండేది మాత్రం శంకరాయపల్లి గ్రామం. 2018లో తండా పంచాయతీలు ఏర్పడిన సమయంలో జడ్చర్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న శంకరాయపల్లి తండాను పంచాయతీగా మార్చారు. అనుబంధ గ్రామంగా శంకరాయపల్లిని చేర్చారు. అయితే ఇదే సమయంలో శంకరాయపల్లి తండాను జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనం చేస్తూ అప్పటి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పేరుకు శంకరాయపల్లి తండా పంచాయతీ అయినప్పటికీ అనుబంధ గ్రామం పంచాయతీగా మార్చాల్సి వచ్చింది. 2019లో ఈ గ్రామానికి ఎన్నికలు నిర్వహించలేకపోయారు. గ్రామ పంచాయతీ గడువు పూర్తికాకపోవటమే అందుకు కారణం. ఆ తర్వాత ఉపఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్యదర్శి, ప్రత్యేక అధికారి పాలన కొనసాగించారు. ఇన్నాళ్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం వచ్చినప్పటికీ సర్పంచ్, నాలుగు వార్డు స్థానాలు ఖాళీగా ఉంచాల్సి వస్తుంది.


