వైఎస్సార్‌లా నీళ్లిచ్చిన దైవం రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌లా నీళ్లిచ్చిన దైవం రేవంత్‌రెడ్డి

Dec 2 2025 12:47 PM | Updated on Dec 2 2025 12:47 PM

వైఎస్సార్‌లా నీళ్లిచ్చిన దైవం రేవంత్‌రెడ్డి

వైఎస్సార్‌లా నీళ్లిచ్చిన దైవం రేవంత్‌రెడ్డి

నారాయణపేట/ మక్తల్‌: ‘మాటలకే పరిమితమైన పేట– కొడంగల్‌ ఎత్తిపోతల పథకం ఆచరణలో పెట్టాలని ఈ ప్రాంతంలో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకానికి శ్రీకారం చుట్టి వెనకబడిన మక్తల్‌– పేట– కొడంగల్‌ నియోజకవర్గాల్లో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.5 వేల కోట్లు మంజూరు చేసింది.. అనాడు థర్డ్‌ కాటన్‌లా.. జలయజ్ఞ ప్రదాత అయిన మరో వైఎస్‌ రాజశేఖరరెడ్డిలా.. అపర భగీరథుడిగా నీళ్లిచ్చిన దైవం మన సీఎం రేవంత్‌రెడ్డి’ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఒక్కసారి ఆలోచించండి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా.. రూ.5 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారని, వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులను ఆదుకోవాలని సీఎంను కోరిన వెంటనే ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. సహచర మంత్రి దామోదర రాజనర్సింహ మక్తల్‌కు ఊరికే వచ్చి చూసిపోతే ఏం బాగుంటుందని దవాఖానాకు రూ.50 కోట్లు ఇచ్చారన్నారు. నారాయణపేట నాలుగు లైన్ల రోడ్డు కోసం రూ.210 కోట్లు ఇచ్చిన సీఎంతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గుడులు, గోపురాల అభివృద్ధికి రూ.కోట్లు మంజూరు చేశారని వివరించారు.

ప్రజాపాలనకు రెఫరెండం

ఇటీవల జూబ్లీహిల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనకు రెఫరెండం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు బిడ్డ అయినందుకే మక్తల్‌– పేట– కొడంగల్‌ ప్రాంతాలు అభివృద్ధి పరుగులు తీస్తున్నాయన్నారు. ఈనాడు కాదు ఆనాటి నుంచి పేదలకు మేలు చేసేది.. దేశానికి కాంగ్రెస్‌ పార్టీనే శ్రీరామరక్ష అన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

మరో ఐదేళ్లు కాంగ్రెస్సే

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఈ మూడేళ్లు కాదు.. మరో ఐదేళ్లు సైతం అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రూ.11,399 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నామన్నారు. గత పదేళ్లలో ఒక్క రేషన్‌ కార్డు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. సన్నబియ్యం ఇవ్వాలన్న ఇంకిత జ్ఞానం గత ప్రభు త్వానికి లేకపోయిందని దుయ్యబట్టారు. హై దరాబాద్‌ తర్వాత మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పనున్నామని వెల్లడించారు.

తెలంగాణ రైజింగ్‌తో ముందడుగు

భవిష్యత్‌లో యువత, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఏవిధంగా ఉండాలనే సదుద్దేశంతోనే తెలంగాణ రైజింగ్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే వెయ్యి బస్సులకు ఓనర్లను చేశామన్నారు. జిల్లాలో పెట్రోల్‌ బంకులు, క్యాంటీన్లు, వడ్డీ లేని రుణాలు ఇచ్చిందన్నారు. నాణ్యతతో కూడిన విద్య, ఆహార భద్రత కల్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement