మహిమాన్వితం.. ఆదిశిలా క్షేత్రం
● వైభవంగా స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
● నేడు స్వామివారి కల్యాణోత్సవం
● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రవాసుడు స్వయంభూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి భక్తజన బాంధవుడిగా విరాజిల్లుతున్నారు. ఇక్కడి ప్రజలు ఆదిశిలా క్షేత్రం వాసుడిగా, తిమ్మప్ప స్వామిగా, శ్రీనివాసుడిగా, మల్దకల్ రాయుడిగా స్వామివారిని సంభోదిస్తుంటారు. ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా గతనెల 25న స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 3న తెప్పోత్సవం, 4న రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి తెలిపారు. 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
గ్రామస్తులు తిరుపతికి వెళ్లరు..
మల్దకల్‌లోనే స్వయంభూగా లక్ష్మీవేంకటేశ్వరస్వామి వెలియడంతో ఆ గ్రామస్తులతో పాటు పెద్దొడి గ్రామ ప్రజలు తిరుపతికి వెళ్లరు. ఇక్కడే స్వామివారిని ఆరాధిస్తారు. అదే విధంగా గ్రామస్తులు ఎక్కువశాతం ఆదిశిలా వాసుడి పేరుతో పిల్లలకు నామకరణం చేస్తారు. కులమతాలకు అతీతంగా మల్దకల్, తిమ్మప్ప, శ్రీనివాసులు, గోవిందు అనే పేర్లతో 40 శాతం మంది ఉన్నారు. ఇదిలా ఉంటే, గ్రామంలో రోజు స్వామివారి పల్లకీ సేవను స్థానిక దశమికట్ట వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. దీంతో స్వామి వారికి పల్లకీ సేవను కింద నుంచే వీక్షించాలనే నమ్మకంతో గ్రామస్తులు రెండో అంతస్తు నిర్మాణానికి ఆసక్తి చూపరు. స్వామివారి పల్లకీ సేవను అంతస్తు పైనుంచి చూస్తే అరిష్టంగా భావిస్తారు. దీంతో గ్రామంలో ఇప్పటి వరకు రెండో అంతస్తు ఎవరూ నిర్మించలేదు.
వాల్మీకి పూజారులే..
మల్దకల్‌లో ఎక్కువగా వాల్మీకి కులస్తులు ఉండటంతో ఆలయంలో జరిగే తొలి పూజల్లో వారే ముందుంటారు. ఆలయంలో పూజలు చేసే వాల్మీకులకు దేవుడి పేరుతో మాన్యాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆలయంలో దేవుడికి సేవలు అందిస్తున్నారు.


