
నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అధికారులు నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వన మహోత్సవం లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేయాలన్నారు. ఆయిల్‌పాం తోటల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో ఎంపీడీఓలు, మండల మహిళా సమాఖ్య, గ్రామైక్య సంఘాల సభ్యులు పాల్గొనాలని తెలిపారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే కళాజాతాలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పింఛన్లు, డెత్, స్పౌస్ కేసులు, పర్మినెంట్ మైగ్రేషన్ వంటివి పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 10,410 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. 5 వేలు మాత్రమే మార్క్ ఔట్ అయ్యాయని, వందశాతం మార్క్ ఔట్ చేసి బేస్‌మెంట్ పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, హౌసింగ్ పీడ భాస్కర్, డీపీఓ పార్ధసారథి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.