
మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాకేంద్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఒడిశా టు పాలమూరు’ శిర్షీకతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ట్యాంక్‌బండ్, రామయ్యబౌళి పరిసర ప్రాంతాల్లో ఉన్న పాన్‌షాపులతో ఇతర దుకాణాలను నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందంతో కలిసి బుధవారం రాత్రి డీఎస్పీ తనిఖీలు నిర్వహించారు. పాన్‌షాప్‌ల పేరుతో నిషేధిత మాదక ద్రవ్యాలను విక్రయాలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. యువత భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి ప్రమాదకర పదార్థాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి తనిఖీలు చేసి అనుమానాస్పద పదార్థాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాలను విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో వన్‌టౌన్ సీఐ అప్పయ్య, ఎస్‌ఐ శీనయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలో పలు పాన్‌షాపుల్లో తనిఖీలు