హరితహారానికి సన్నద్ధం | Sakshi
Sakshi News home page

హరితహారానికి సన్నద్ధం

Published Mon, May 27 2024 11:10 PM

హరితహారానికి సన్నద్ధం

ఈ ఏడాది 30.87 లక్షల

మొక్కలు నాటడమే లక్ష్యం

10వ విడతకు 1,210 స్థలాల గుర్తింపు

శాఖల వారీగా కేటాయింపులు పూర్తి

18 రకాల జాతుల మొక్కలు

అందుబాటులో..

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో

ఇదే మొదటిసారి

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో తొమ్మిది విడతలుగా కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహించింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తొలి విడత కానుంది. అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో మొక్కలు పెంచుతున్నారు. కాగా ఈసారి జిల్లాకు హరితహారం కింద 30.87 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో కచ్చితంగా జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల్లో ఒక నర్సరీని ఏర్పాటు చేయాల్సి ఉండగా అందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. మొక్కల పర్యవేక్షణకు పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులకు నర్సరీల నిర్వహణపై అవగాహన కల్పించారు.

25 లక్షల టేకు మొక్కలు

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా టేకు మొక్కలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సీజన్‌లో 25 లక్షల టేకు మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా అందుకు అనుగుణంగా మొక్కలు పెంచుతున్నారు.

మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం

హరితహారంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళిక రూపొందించింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఎండ నుంచి సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నర్సరీలకు షేడ్‌ నెట్స్‌ బిగించడంతోపాటు ప్రతిరోజు రెండుసార్లు నీళ్లు పోసి సంరక్షించారు. ఈ ఏడాది అన్ని నర్సరీలు డీఆర్‌డీఓ, అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయగా.. జిల్లా ఉన్నతాధికారులు ఆయా నర్సరీలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.

18 రకాల మొక్కలు...

ఈ ఏడాది హరితహారంలో భాగంగా 18 రకాల మొక్కలు నాటనున్నారు. ఇందులో టేకు, కానుగ, సీతాఫలం, గంగరేగు, చింత, గుల్‌మోహార్‌, జామ, తుమ్మ, ఖర్జూర, నిమ్మ, దానిమ్మ, టేకోమ, నేరేడు, నీలగిరి, సీమచింత, మునగ, వెలగ, మారేడు మొక్కలు పెంచుతున్నారు. ఇందులో 10 రకాల పళ్ల మొక్కలు కాగా.. మిగతావి నీడనిచ్చేవి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement