సత్వర పరిష్కారమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారమే లక్ష్యం

Published Mon, May 27 2024 11:10 PM

 సత్వ

మహబూబ్‌నగర్‌ క్రైం: అనేక రంగాల్లో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టేందుకు దోహదపడుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు వినియోగిస్తున్నారు. ప్రజల అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుని పెద్దమొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన సైబర్‌ మోసాలు ఇప్పుడు గ్రామీణులనూ హడలెత్తిస్తున్నాయి. వీటిని అరికట్టడం కత్తిమీద సాములా తయారవుతున్న తరుణంలో సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టడానికి తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) ప్రత్యేక దృష్టిసారిస్తోంది. సైబర్‌ నేరాల దర్యాప్తులో వేగం పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా సైబర్‌ వారియర్స్‌ వ్యవస్థను నెలకొల్పింది.

సైబర్‌ నేరాలను అరికట్టడంతోపాటు బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా సైబర్‌ వారియర్స్‌ పనిచేయనున్నారు. బాధితుల నుంచి ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేసి సత్వరం నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టి ంగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ)లో పొందుపరుస్తారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930 ద్వారా వచ్చే కేసులను స్వీకరించి బాధితుల వివరాలను టీఎస్‌సీఎస్‌బీకి అందిస్తారు. ప్రభుత్వం త్వరలో వారియర్స్‌కు ప్రత్యేక సెల్‌ఫోన్‌ నంబర్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా బాధితులు సంబంధిత పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వారియర్‌ను ఫోన్‌లో కూడా సంప్రదించవచ్చు.

చైతన్యపరుస్తున్నాం..

సైబర్‌ నేరగాళ్ల ద్వారా మోసపోయిన బాధితులు స్టేషన్‌కు వస్తే వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి జిల్లా సైబర్‌ సెల్‌ పోర్టల్‌లో నమోదు చేస్తాం. ఆ తర్వాత సంబంధిత బ్యాంకుకు సమాచారం చేరవేసి నగదు ఫ్రీజ్‌ చేయిస్తాం. కోర్టుకు లెటర్‌ రాయడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్‌ మోసాలపై చైతన్యపరుస్తున్నాం. మోసపోయిన బాధితుడు ఉంటే సకాలంలో స్టేషన్‌కు వస్తే మిగిలిన సొమ్ము కొట్టేయకుండా కాపాడవచ్చు.

– కిషన్‌సింగ్‌, సైబర్‌ వారియర్‌, టూటౌన్‌

జిల్లాలో అందుబాటులోకి..

జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒక సైబర్‌ వారియర్‌ను ఏర్పాటు చేశాం. బాధితుల నుంచి వివరాలు సేకరించడం వీరి పని. ప్రస్తుతం ఈ వ్యవస్థ జిల్లాలో అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా సైబర్‌ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటే తక్షణమే 1930 లేదా డయల్‌ 100 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. తమ అకౌంట్‌లో డబ్బులు పోయిన 24 గంటల్లోగా పై నంబర్లకు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.

– వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్‌

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకరు

పోలీస్‌ వ్యవస్థ విస్తృతంగా ప్రచారం చేస్తున్నా తరచుగా సైబర్‌ మోసాలు వెలుగు చూస్తున్నాయి. విద్యావంతులు సైతం బాధితులుగా మారుతుండటం విస్మయపరుస్తోంది. సైబర్‌ మోసాలను అరికట్టడంతో పాటు ప్రజల్లో వాటిపై అవగాహన కల్పించడానికి వారియర్స్‌ వ్యవస్థను టీఎస్‌సీఎస్‌బీ రూపొందించింది. విద్యార్హత, సైబర్‌ మోసాలపై అవగాహన, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన సిబ్బందిలో ఒక్కో పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒక్కొక్కరి చొప్పున ఎంపిక చేసి సైబర్‌ మోసాలను ఎదుర్కొనేందుకు కావాల్సిన శిక్షణ ఇచ్చింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒక సైబర్‌ వారియర్‌ ఉంటే కేసుల దర్యాప్తు వేగవంతమవుతుందని భావిస్తున్నారు.

 సత్వర పరిష్కారమే లక్ష్యం
1/2

సత్వర పరిష్కారమే లక్ష్యం

 సత్వర పరిష్కారమే లక్ష్యం
2/2

సత్వర పరిష్కారమే లక్ష్యం

Advertisement
 
Advertisement
 
Advertisement