తిరస్కరణ 13 నియోజకవర్గాల్లో 223 మందికి ఆమోదం | Sakshi
Sakshi News home page

తిరస్కరణ 13 నియోజకవర్గాల్లో 223 మందికి ఆమోదం

Published Tue, Nov 14 2023 1:40 AM

- - Sakshi

తిరస్కరణ
13 నియోజకవర్గాల్లో 223 మందికి ఆమోదం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/జెడ్పీసెంటర్‌/జడ్చర్ల/దేవరకద్ర: ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. షాద్‌నగర్‌ మినహా 13 నియోజకవర్గాల్లో కలిపి 266 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 43 మంది నామినేషన్లను తిరస్కరించారు. 223 మందికి ఆమోదం తెలపగా.. నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉంది. కాగా.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి ఆరుగురి నామినేషన్లను తిరస్కరించారు. ఇందులో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ముగ్గురు, జడ్చర్లలో ఒకరి, దేవరకద్రలో ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. కాగా దేవరకద్రలో రెండు చోట్ల ఓటు ఉందని కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డిపై ఫిర్యాదు రావడంతో ఉత్కంఠకు దారి తీసింది. చివరికి రాత్రి 7 గంటల సమయంలో ఆయన నామినేషన్‌కు ఆమోదం తెలిపారు. కాగా.. అలంపూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు జోడించలేదని మిగతా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. చివరికి ఆమోదం తెలిపారు.

దేవరకద్రలో 14 మంది...

దేవరకద్ర నియోజకవర్గం నుంచి 16 మంది అభ్యర్థులు 30 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. ఇందులో బీజేపీ నుంచి డమ్మీ అభ్యర్థిగా బాలకృష్ణ అలియాస్‌ దేవరకద్ర బాలన్న బీఫాం సమర్పించనందున నామినేషన్‌ తిరస్కరించగా.. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌కు ఆమోదం తెలిపారు. ఇక భారత చైతన్య యువజన పార్టీ నుంచి పోటీ చేసిన మహేందర్‌ నామినేషన్‌ పత్రంపై సంతకం చేయకపోవడంతో తిరస్కరణకు గురైంది. యుగ తులసి పార్టీ నుంచిపోటీ చేసిన శివమల్లేశ్‌ నామినేషన్‌లో వయసు తక్కువగా ఉండడంతో తిరస్కరించినట్లు ఆర్‌ఓ నటరాజ్‌ తెలిపారు. మొత్తం 30 సెట్ల నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా 16 మంది నామినేషన్లు వేయగా 14 మంది బరిలో మిగిలారు. ఆల వెంకటేశ్వర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్‌), కొండా ప్రశాంత్‌రెడ్డి (బీజేపీ), సంతోష్‌కుమార్‌రెడ్డి (బీఎస్పీ), జంగయ్య (ధర్మసమాజ్‌ పార్టీ), రాము (స్వతంత్ర), జి.కథలయ్య (విద్యార్థుల రాజకీయ పార్టీ), ఎల్లప్ప (ప్రజా ఏక్తా పార్టీ), బండ మధుసూదన్‌రెడ్డి (జన శంఖారావం పార్టీ), బొమ్మ రాఘవేంద్ర(ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌) ఎమ్‌.బాలకృష్ణ ( స్వతంత్ర), ఎండీ.అబ్దుల్‌ అజీజ్‌ఖాన్‌ (స్వతంత్ర), మండ్ల వెంకటకృష్ణరెడ్డి ( స్వతంత్ర), ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి (స్వతంత్ర)లు పోటీలో మిగిలారు.

● జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి 20 మంది నామినేషన్లు వేయగా ఒకరి నామినేషన్‌ తిరస్క రించినట్లు రిటర్నింగ్‌ అధికారి మోహన్‌రావు తెలిపా రు. శశికళరెడ్డి నామినేషన్‌ దాఖలు చేయగా.. ఏ, బీ ఫాం సమర్పించకపోవడంతో తిర్కరించినట్లు పేర్కొన్నారు. డా.సి. లక్ష్మారెడ్డి( బీఆర్‌ఎస్‌), జనంపల్లి అనిరుధ్‌రెడ్డి(కాంగ్రెస్‌), చిత్తరంజన్‌దాస్‌ (బీజేపీ), శివకుమార్‌(బీఎస్పీ), ఎడ్ల బాలవర్ధన్‌గౌడ్‌ (ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌), ఇమ్మడి ఆనంద్‌(బహుజన ముక్తి), అనిల్‌కుమార్‌ (జన శంఖారావం), కె.నర్సింగ్‌రావు(గణసురక్ష పార్టీ), కోస్గి యాదయ్య (ధర్మసమాజ్‌), మాతాశ్రీ జానకమ్మ(రాష్ట్ర సమా ఖ్య ప్రజా పార్టీ), శ్రీకాంత్‌ పిల్లెల (భారత చైతన్య యువజన పార్టీ), వెల్జాల బసవయ్య(ఆర్‌.సీపీఐ), స్వతంత్రులు ఏ.రవికుమార్‌, బచ్చలాకుర మల్ల య్య, జంగయ్య కానుగుల, కావలి శ్రీనివాసులు, ఎల్‌.మోహన్‌, ముడావత్‌ శంకర్‌, రాంబాబురెడ్డి ద్యాప నామినేషన్లకు ఆమోదం తెలిపారు.

మహబూబ్‌నగర్‌ నుంచి19 మంది..

మహబూబ్‌నగర్‌ అసెంబ్లీకి సంబంధించి 22 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 19 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపినట్లు మహబూబ్‌నగర్‌ రిటర్నింగ్‌ అఽధికారి అనిల్‌కుమార్‌ పరిశీలించారు. అంతటి హరిప్రసాద్‌గౌడ్‌ స్వతంత్ర అభ్యర్థి, వీర బ్రహ్మచారి (బీజేపీ డమ్మీ), ఉదయ్‌ తేజ్‌ నాయక్‌ (డెమోక్రటిక్‌ అలయన్‌న్స్‌) నామినేషన్లు తిరస్కరించారు. మహబూబ్‌నగర్‌లో వీ.శ్రీనివాస్‌గౌడ్‌ (బీఆర్‌ఎస్‌), మిథున్‌రెడ్డి (బీజేపీ), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌), స్వప్న(బీఎస్పీ), ఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌(బహుజన్‌ ముక్తి పార్టీ), కామారం ఎల్లప్ప (యుగ తులసి పార్టీ), టి.కృష్ణ (భారత చైతన్య యువజన పార్టీ), ఖాదర్‌(ప్రగతిశీల సమాజ్‌ పార్టీ), మున్నూర్‌ రవి(ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌), రాములు(ధర్మ సమాజ్‌), సి. శ్రీనివాస్‌రెడ్డి (జన శంకరం పార్టీ), స్వతంత్రులుగా అశోక్‌కుమార్‌ గజ్బింకర్‌, కారుకొండ శ్రీనివాసులు, మల్కపురం శ్రీనివాస్‌గౌడ్‌, ఎండీ ఇంతియాజ్‌ అహ్మద్‌, ఎండీ షరీఫ్‌, ఎం. శ్రీనివాసులు, శ్రీశైలం, సరస్వతి మెట్టుకాడి పోటీలో నిలిచారు.

8 గంటల పాటు ఉత్కంఠ

దేవరకద్ర రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు పరిశీలన ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డి నామినేషన్‌పై అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. చిన్నచింతకుంట మండలంలో ఒక ఓటు, హైదరాబాద్‌లో మరో ఓటు ఉన్నాయని.. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఎలా ఉంటుందని ఫిర్యాదు చేశారు. ఈసీ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలనిపట్టుపట్టారు. దీంతో రిటర్నింగ్‌ అధికారి నటరాజ్‌ ఉన్నతాధికారులను సంప్రదించారు. నామినేషన్ల పరిశీలనలో వచ్చిన ఫిర్యాదుపై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డి, ఆయనకు తోడుగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి ఆర్‌ఓ కార్యాలయంలోనే రాత్రి వరకు ఉన్నారు. మరోవైపు అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండ ప్రశాంత్‌రెడ్డి, ఇతర అభ్యర్థులు ఆర్‌ఓ కార్యాలయంలోనే ఉండిపోయారు. చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఇచ్చిన వివరణలకు సంతృప్తి చెందిన ఆర్‌ఓ నామినేషన్‌ను ఓకే చేశారు. కాగా.. నామినేషన్‌పై అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆర్‌ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చివరికి నామినేషన్‌ ఒకే చేసుకొని కాంగ్రెస్‌ అభ్యర్థి బయటకు రావడంతో కేరింతలు కొడుతూ, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ముగిసిన నామినేషన్ల పరిశీలన

దేవరకద్ర ఆర్‌ఓ కార్యాలయంలో హైడ్రామా

రెండు ప్రాంతాల్లో ఓటు ఉందని కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఫిర్యాదు

రాత్రి 7గంటల వరకు కొనసాగిన ఉత్కంఠ

చివరికి ఓకే చేసిన రిటర్నింగ్‌ అధికారి

15 వరకు ఉపసంహరణకు గడువు

1/2

జడ్చర్లలో నామినేషన్ల పరిశీలనచేస్తున్న ఆర్‌ఓ మోహన్‌రావు, తదితరులు
2/2

జడ్చర్లలో నామినేషన్ల పరిశీలనచేస్తున్న ఆర్‌ఓ మోహన్‌రావు, తదితరులు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement