పుష్కరతీరంలో భక్తుల పులకింత | - | Sakshi
Sakshi News home page

పుష్కరతీరంలో భక్తుల పులకింత

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

కాళేశ్వరం: అంత్య పుష్కరాలతో కాళేశ్వరం క్షేత్రం, నదీ తీరం సందడిగా మారింది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు భక్తుల రాక కొంత పెరగడంతో గోదా వరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వ తీ నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, శ్రీశుభానందదేవి, సరస్వతీ అమ్మవార్లు దర్శించుకున్నారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తు ల సందడి పెరగడంతో అధికారులు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశా రు. పార్కింగ్‌ స్థలాల వద్ద వాహనాలు నిలిచి కనిపించాయి. సుమారుగా 10వేల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు.

ప్రముఖుల పూజలు..

ఖమ్మం జిల్లా మధిర జడ్జి కల్పన, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌కిశోర్‌ఝా దంపతులు త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశుభానంద, శ్రీసరస్వతీ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంరతం ఆశీర్వచన వేదిక వద్ద వారిని ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సన్మానించి తీర్ధప్రసాదాలు అందజేశారు.

గవర్నర్‌ తిరుగు ప్రయాణం..

అంత్య పుష్కరాల తొలిరోజు గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా దంపతులు కాళేశ్వరం వచ్చి పుష్కర స్నానాలు చేసి ఆలయంలో దర్శనాలు చేశారు. మహదేవపూర్‌ టస్సర్‌ కాలనీలో తయారు చేసే దసిలిపట్టు వస్త్రాల స్టాల్స్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి గవర్నర్‌ పరిశీలించారు. వారికి పట్టువస్త్రాల తయారీ గురించి దేవాంగ కులస్తులు చేనేత కార్మికుడు గొర్రె బాపు, మంత్రి వివరించారు. ఆయనతో కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఉన్నారు. ఆయన ఉదయం 8.30గంటలకు హెలికాప్టర్‌లో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి తిరిగివెళ్లిపోయారు.

మ్యూజియంలోకి పురాతన శిల్పాలు

కాళేశ్వరంలో అంత్యపుష్కరాల సందర్భంగా గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా చేతుల మీదుగా ప్రారంభించిన మ్యూజియంలో పురావస్తుశాఖ అధికారులు 11, 12, 13 శతాబ్దాలకు చెందిన విగ్రహాలను అమర్చారు. చారిత్రక ఆధారాలు మాత్రం ఇప్పటికీ అధికారులు ప్రకటించలేదు. ఇసుక రాయి, బసాల్ట్‌ స్టోన్‌ తదితర రాతితో విగ్రహాలు చెక్కినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా, మంత్రి శ్రీధర్‌బాబు ఆయన సతీమణి దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌ మ్యూజియం నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు.

ఘనంగా గోదావరి హారతి

అంత్య పుష్కరాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం రాత్రి సరస్వతి స్తోత్రంతో హారతి కార్యక్రమం, త్రివేణి సంగమంలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, ఈఓ మహేష్‌ భక్తులు పాల్గొన్నారు.

నదిలో స్నానం చేసి దీపం వదులుతున్న మహిళలు

రెండో రోజు పుష్కర స్నానానికి భక్తుల తాకిడి

మొదటి రోజుకంటే కొంత పెరిగిన భక్తుల సంఖ్య

Advertisement
 
Advertisement
Advertisement