రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో ఈనెల 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు డీడబ్ల్యూఓ సబిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మానవ హక్కులు, దివ్యాంగుల శ్రేయస్సు, సామాజిక సంక్షేమానికి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దివ్యాంగులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని దివ్యాంగ సంఘాలు, అసోసియేషన్స్ ప్రతినిధులు, ప్రజలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక సేవలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
డీఈఓగా రాజేశ్వర్
మహబూబాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారిగా వి.రాజేశ్వర్ నియామకం అయ్యారు. ఇక్కడ పనిచేసిన డీఈఓ దక్షణామూర్తి వీఆర్‌ఎస్ తీసుకోవడంతో.. డీఈఓ కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్వర్‌కు ఇన్‌చార్జ్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జాయింట్ సెక్రటరీగా తోట సురేశ్
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మాజీ క్రీడాకారుడు తోట సురేశ్‌ను నియమిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా తోట సురేశ్ మాట్లాడుతూ.. జిల్లా కబడ్డీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా అవకాశం ఇచ్చినందుకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐఈఎల్‌టీఎస్ ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా అంతర్జాతీయ స్కాలర్షిప్‌లు పొందడానికి బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌రావు సోమవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 0870–2571192, 040–24071178 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఉత్తములకు అవార్డులు
నెహ్రూసెంటర్: జిల్లాలో ఎయిడ్స్ విభాగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ జీజీహెచ్ ఎస్‌ఎస్‌కే సెంటర్ మేనేజర్ బానోత్ రమేష్ సోమవారం ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి చేతులగా అవార్డు అందుకున్నట్లు రమేశ్ తెలిపారు. జీజీహెచ్‌లోని ఎస్‌ఎస్‌కే విభాగంలో పని చేస్తున్న స్టాఫ్‌నర్సు జ్యోతి ఉత్తమ ఉద్యోగిగా డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు చేతుల మీదుగా మహబూబాబాద్‌లో అవార్డు అందుకున్నారు.
హేమాచలక్షేత్రంలో
పీఓ ప్రత్యేక పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, పూజారులు ఆమెను మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి పీఓ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను అర్చకులు శేఖర్‌శర్మ, అనిపెద్ది నాగ, రాజీవ్‌శర్మ వివరించారు. స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం


