
నాలుగో నంబర్ ప్లాట్‌ఫారం నిర్మించాలి
● డీఆర్‌ఎంను కలిసిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో నిర్మాణం పూర్తయిన మూడోలైన్ పరిశీలనకు వచ్చిన సీఎస్‌ఆర్ మాధవి, డీఆర్‌ఎం రాజగోపాలకృష్ణన్‌ను నాలుగో నంబర్ ప్లాట్ ఫారం నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే మురళీనాయక్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, వినియోగదారుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. మహబూబాబాద్ పట్టణంలోని కోర్టు వైపున నూతనంగా ప్రవేశ ద్వారం నిర్మించాలని, వందే భారత్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, కొత్త రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు. సిగ్నల్ కాలనీ, కురవి గేటు వద్ద అండర్ పాస్ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, నూతన ఆర్‌ఓబీని తక్షణమే నిర్మించాలని, రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలన్నారు. కొత్త బజార్ ప్రయాణికులకు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంక్షేమ మండలి కార్యదర్శి మైస శ్రీనివాసులు, సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథిరెడ్డి, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సూర్నపు సోమయ్య, ఆయా పార్టీల ముఖ్య నాయకులు గిరిధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.