
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ప్రజలు
● పెరుమాండ్ల రామకృష్ణ
పరకాల: అసాధ్యం అనుకున్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుసాధ్యం చేసి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగ ప్రజానీకమే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం ఖాయమని అన్నారు. పరకాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత తీసుకురావడంతోపాటు దండోరా పోరాటంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించినట్లు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. పరకాల నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభివృద్ధిలో కుంటుపడేస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాట్లాడుతూ.. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ దండోరా కమిటీల పునానిర్మాణం చేసి జాతి ఐక్యతకు హక్కుల సాధనకు మాదిగలు కలిసి రావాలని పిలుపుచ్చారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కలిసి సన్మానించారు. కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ బాధ్యులు పెండెల రాము, పెండెల సారన్న, పూరెల్ల సూర్యం, పెండెల తిరుపతి, బరిగెల అనిల్, వడ్ల నవీన్, పెండెల ప్రసాద్, మొండి సమ్మయ్య పాల్గొన్నారు.