
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించకుంటే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుళ్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కె.ఈశ్వర్ రావు, కన్వీనర్ ఎం.ఎ.వజీర్ అన్నారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను శాశ్వత ఎంప్లాయ్‌గా కన్వర్షన్ చేయాలని డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా చేశారు. అంతకు ముందు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇతర శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఆర్టిజన్ ఉద్యోగులను పోల్చొద్దన్నారు. ఇది కంపెనీ అని, ఐడీ యాక్ట్ వర్తిస్తుందన్నారు. యాజమాన్యానికి తమకు లేబర్ కమిషనర్ ఎదుట 12(3) ఒప్పందం కూడా కుదిరిందన్నారు. ఆ ఒప్పందాన్ని గత ప్రభుత్వం తుంగలో తొక్కి స్టాండింగ్ రూల్స్ తీసుకొచ్చిందని, ఈ రూల్స్‌కు వ్యతిరేకంగా పది నెలలుగా జరుగుతున్నదే ఈ కన్వర్షన్ పోరాటమన్నారు. ఈ నెల 14 ఉదయం 6 గంటల నుంచి సమ్మె చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 10న లేబర్ కమిషనర్‌తో చర్చలున్నాయని, ఈ చర్చలు సఫలం కాకపోతే నిరవధిక సమ్మె తప్పదన్నారు. తెలంగాణ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ కందికొండ వెంకటేశ్, కోకన్వీనర్ కృష్ణమాచారి. నాయకులు చంద్రారెడ్డి, సలీంపాషా, రఘునాథరెడ్డి, ప్రసాద రాజు, మురళి, ఐలయ్య, రాజన్న, జయచందర్, సృజన, శ్రీనాథ్, శ్రీకాంత్, రాజేందర్ పాల్గొన్నారు.
ఏపీ ఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్
వర్తింపజేయాలి
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కె.ఈశ్వర్ రావు, కన్వీనర్ ఎం.ఎ.వజీర్