
హత్య కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
వరంగల్ లీగల్ : నగరంలోని ఉర్సు గుట్ట సమీపంలో వనం రాకేశ్ అనే వ్యక్తిని హత్య చేసినఘటనలో శివనగర్‌కు చెందిన గాడుదుల రాజేశ్, జున్ను హరికృష్ణ అలియాస్ బంటికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2022, ఆగస్టు 27న వనం రాకేశ్ తన మిత్రులు మరుపట్ల నిఖిల్, శివ, తదితరులతో ఉర్సు గుట్ట సమీపంలోని మహాలక్ష్మి బేకరీ వద్ద ఉ న్న సమయంలో కడిపికొండ వైపు నుంచి బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. రాకేశ్, తన మిత్రుల సమీపంలోకి వచ్చి మూత్ర విసర్జన చేస్తుండగా ఇక్కడ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో రాకేశ్‌తో నిందితులు ఘర్షణ పడుతుండగా రాకేశ్ మి త్రులు నిఖిల్, శివ నివారించారు. దీంతో ఇద్దరు వ్య క్తులు(బైక్‌పై వచ్చిన వారు).. రాజేశ్, హరికృష్ణ అలియాస్ బంటికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా సుమారు తొమ్మిది మంది అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఉర్సు గుట్టకు చేరుకుని అక్కడే ఉన్న రాకేశ్, నిఖిల్‌పై దాడి చేశారు. హరికృష్ణ కత్తితో రాకేశ్‌ను పొడవగా అడ్డుకోవడానికి వెళ్లిన తన స్నేహితులు నిఖిల్, శివకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం మేరకు స్థానికులు అంబులెన్స్‌లో బాధితులను ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు రాకేశ్ మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చారు. విచారణలో గాడుదుల రాజేశ్, జున్ను హరికృష్ణ అలియాస్ బంటిపై నేరం రుజువుకావడంతో ఇద్దరికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి నిర్మలా గీతాంబ తీర్పు వెలువరించారు. ఈ కేసును పోలీస్ అధికారులు శ్రీనివాస్, రమేశ్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో కానిస్టేబుల్ ప్రతాప్, హోంగార్డు సదానందం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరబోయిన శ్రీనివాస్ కేసు వాదించారు.
తీర్పు వెలువరించిన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి