
పోక్సో కోర్టు పీపీగా వెంకటయ్య
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన న్యాయవాది కొంపెల్లి వెంకటయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, రాంచంద్రునాయక్, యశస్వినిరెడ్డి, ఎంపీ పోరిక బలరాంనాయక్, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగాయని, బాధితులకు అండగా ఉండి నిందితులకు శిక్షలుపడేలా కృషి చేస్తానని కొంపెల్లి వెంకటయ్య తెలిపారు.
నేడు ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా
మహబూబాబాద్ రూరల్: ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా నేడు(గురువారం) నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ ఆధికారి జినుగు మరియన్న బుధవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 200 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటుతామన్నారు. ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా సందర్భంగా రైతులు అధికసంఖ్యలో హాజరు కావాలని కోరారు.
నూతన సబ్‌స్టేషన్లు మంజూరు
నెహ్రూసెంటర్: జిల్లాకు నూతనంగా 8 సబ్ స్టేషన్లు మంజూరు కాగా పనులు ప్రారంభమయ్యాయని జిల్లా విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పి.విజేందర్‌రెడ్డి బుధవారం తెలిపారు. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో లోఓల్టేజ్ సమస్య, మౌలిక వసతుల అభివృద్ధికి అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుతో వినియోగదారులకు, రైతులకు విద్యుత్ అంతరాయలు తగ్గుతాయని స్పష్టం చేశారు.
13న పంచరామాలకు ఆర్టీసీ బస్సు యాత్ర
నెహ్రూసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర టూర్ ప్యాకేజీలో భాగంగా పంచరామాలకు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) ఈ నెల 13న రాత్రి 11 గంటలకు యాత్ర బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ బుధవారం తెలిపారు. పంచరామాలకు రెండు రోజులకు గానూ ఒక్కొక్కరికి రూ.1700 చార్జ్‌గా నిర్ణయించామన్నారు. అదే విధంగా మల్లూరు, బొగత జలపాతం, లక్నవరం, రామప్ప ఒక్కరోజు టూర్ ప్యాకేజీకి ఒక్కొక్కరికి రూ.700 చార్జ్‌గా నిర్ణయించామని, బస్సు ఈ నెల 13న ఉదయం 5గంటలకు డిపో నుంచి బయలుదేరుతుందని డీఎం పేర్కొన్నారు. టికెట్ బుకింగ్ వివరాల కోసం ఎండి.నబి 99482 14022 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ఆత్మరక్షణకు కరాటే దోహదం
మహబూబాబాద్ అర్బన్: నేటి సమాజంలో బాలికలు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ క్యాపు కార్యాలయంలో బధవారం జాతీయస్థాయిలో పథకాలు సాధించిన సోహతబుస్‌ను అదనపు కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు. కార్యక్రమంలో కోచ్ జహీద్ తదితరులు పాల్గొన్నారు.
‘స్వచ్ఛభారత్’ పరిశీలన
నెల్లికుదురు: మండలంలోని వావిలాల గ్రామంలో స్వచ్ఛభారత్ అమలు విధానాన్ని సెంట్రల్ అకాడమిక్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ బృందం బుధవారం పరిశీలించింది. గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్, స్కూల్, గ్రామ పంచాయతీ, దేవాలయ ప్రాంతం, సెగ్రిగేషన్ షెడ్, ఇంకుడు గుంతలను బృందం సభ్యులు పరిశీలించారు. రాష్ట్ర కోఆర్డినేటర్ జి.నరేశ్, సూపర్‌వైజర్ మధుకర్, డీపీఓ పుల్లారావు, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ బానోతు పద్మ, ఎంఈఓ రామ్‌దాస్, జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్లు శ్రవణ్, రవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పోక్సో కోర్టు పీపీగా వెంకటయ్య