
మరమ్మతులేవి?
బోనాలతో వెళ్తున్న మహిళలు
డోర్నకల్: మండలంలోని మున్నేరువాగు సమీపంలో చాప్లాతండా గ్రామపంచాయతీకి చెందిన శ్మశానవాటిక, వర్మి కంపోస్ట్ షెడ్ ఏడాది క్రితం వరదలతో ధ్వంసమయ్యాయి. కాగా, నాలుగేళ్ల క్రితం వాటిని నిర్మించారు. పనుల అనంతరం అప్పటి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. అయితే గత వానాకాలం జూలై 27న భారీ వర్షాలతో మున్నేరుకు వరదలు రావడంతో వర్మి కంపోస్ట్ షెడ్‌తో పాటు శ్మశానవాటిన ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరదధాటికి ధ్వంసం..
వర్మి కంపోస్ట్ షెడ్ కంపార్ట్‌మెంట్లతో పాటు శ్మశాన వాటిక బర్నింగ్ ప్లాట్‌ఫారాలు, టాయిలెట్లు వరద ధాటికి ధ్వంసమయ్యాయి. వర్మి కంపోస్ట్ షెడ్ ధ్వంసమవడంతో చాప్లాతండా గ్రామం నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. శ్మశానవాటిక దెబ్బతినడంతో చనిపోయిన వారి అంత్యక్రియలు మున్నేరువాగు ఒడ్డున నిర్వహిస్తున్నారు. కాగా మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినా నేటికీ నిధులు మంజూరు కాలేదు.
సపోర్టు కట్టను పట్టించుకోవడం లేదు..
వరదతో మున్నేరు ఆనకట్ట సపోర్టు కట్ట కొట్టుకుపోగా నేటికీ మరమ్మతులు చేపట్టలేదు. నాడు వరదల్లో సపోర్టు కట్ట కొట్టుకుపోవడంతో దిగువ ప్రాంతాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కొన్ని రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్ సపోర్టు కట్టను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు వర్షాకాలం ప్రారంభమై వర్షాలు పడుతుండటంతో మున్నేరువాగుకు వరద వచ్చే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి వాగు సపోర్టు కట్ట మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఏడాది క్రితం వరదల్లో ధ్వంసమైన
శ్మశానవాటిక, వర్మి కంపోస్ట్ షెడ్
పట్టించుకోని అధికారులు