
చికిత్స పొందుతున్న అన్‌మ్యాన్ కార్మికుడి మృతి
కురవి : నేరడ గ్రామానికి చెందిన విద్యుత్ శాఖలో అన్‌మ్యాన్ కార్మికుడు బుర్ర శ్రీకాంత్ (35) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. నేరడకు చెందిన శ్రీకాంత్ 15ఏళ్లుగా విద్యుత్ శాఖలో అన్‌మ్యాన్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. జూన్ 6వ తేదీన తట్టుపల్లి శివారు చంద్యా తండా గ్రామంలో ఓ రైతు చేను వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని మానుకోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించి నడుముకు శస్త్ర చికిత్స చేయించారు. చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను ఈనెల 3వ తేదీన ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. విద్యుత్ శాఖ తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.