లక్షే లక్ష్యం.. | Sakshi
Sakshi News home page

లక్షే లక్ష్యం..

Published Fri, Apr 19 2024 1:40 AM

మాట్లాడుతున్న వరంగల్‌ ఆర్‌ఎం శ్రీలత - Sakshi

హన్మకొండ: టీఎస్‌ ఆర్టీసీ.. ఆదాయం పెంచుకునే దిశలో సరికొత్త చాలెంజ్‌లతో ముందుకెళ్తోంది. ఆర్టీసీ ఎండీగా వి.సి.సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ పరిరక్షణ, ఆదాయ పెంపునకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే దసరా, రాఖీ, సంక్రాంతి, ఆల్‌ డిపోస్‌ ప్రాఫిట్‌ చాలెంజ్‌, 100 రోజుల చాలెంజ్‌, ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం, విధుల్లో నైఫుణ్యం ప్రదర్శించాలి వంటి కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా ‘లక్షే లక్ష్యం’ అనే పేరుతో మరో చాలెంజ్‌ తీసుకువచ్చింది.

పెరిగిన వ్యయాన్ని పూడ్చుకునేందుకు..

ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం వేతన సవరణ చేసింది. వేతన సవరణ ద్వారా పెరిగిన వ్యయాన్ని పూడ్చుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగా ప్రతి డిపోలో ప్రతి రోజు ఆదాయం పెంచుకోవాలని చాలెంజ్‌ తీసుకువచ్చింది. రోజు అదనంగా రూ.లక్ష ఆదా యం తీసుకురావాలన్నదే ‘లక్షే లక్ష్యం’ చాలెంజ్‌. ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించారు. ఈ చాలెంజ్‌ ఏడాది పాటు కొనసాగుతుంది. వరంగల్‌ రీజియన్‌లో 9 డిపోలున్నాయి. ఈ లెక్కన రీజియన్‌లో ప్రతి రోజు అదనంగా రూ.9 లక్షల ఆదాయం తీసుకురావాలి. ఆదాయం పెంచుకోవాలంటే ప్రయాణికులను ఆర్టీసీ వైపునకు ఆకర్షించాలి. ప్రస్తుత ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటేనే ఈ చాలెంజ్‌లో రాణిస్తారు. అదనపు ట్రిప్పులు నడపడం, ప్రయాణికులను పిలిచి బస్సు ఎక్కించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోనున్నారు.

డిపోల ఆదాయ సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం..

వరంగల్‌ రీజియన్‌లోని 9 డిపోలకు ఆయా డిపోల ఆదాయ సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం నిర్దేశించుకున్నారు. వరంగల్‌ రీజియన్‌లో జీరో టికెట్‌తో కలిపితే రోజూ సగటున రూ.2.20 కోట్ల ఆదాయం వస్తోంది. జీరో టికెట్‌ను మినహాయిస్తే నగదు రూపేణ రోజూ సగటున రూ.1.20 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆదాయానికి అదనంగా మరో రూ.9 లక్షలు రాబట్టుకోవడమే ఈ చాలెంజ్‌ లక్ష్యం. ఆదాయం తక్కువగా వచ్చే డిపోల నుంచి అధిక ఆదాయం వచ్చే డిపోల వారీగా రోజుకు రూ.50 వేల నుంచి రూ.1.80 లక్షల ఆదాయం అదనంగా రాబట్టుకోవాలని నిర్దేశించుకున్నారు. రోజుకు రూ.9 లక్షల లెక్కన నెలకు రూ.2.70 కోట్లు, సంవత్సరానికి రూ.64,80 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా వరంగల్‌ రీజియన్‌ యాజమాన్యం ముందుకెళ్తోంది. కాగా, వరంగల్‌ రీజియన్‌లో ‘లక్షే లక్ష్యం’ చాలెంజ్‌ను గురువారం హనుమకొండలోని వరంగల్‌–1 డిపోలో వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ జాస్తి శ్రీలత ప్రారంభించారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించాలని, ప్రతి స్టేజీలో పిలిచి ఎక్కించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎం వంగల మోహన్‌ రావు, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (మెకానికల్‌) శ్రీనివాసులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ట్రాఫిక్‌) సంతోష్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్టీసీలో మరో చాలెంజ్‌

ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు

వరంగల్‌ రీజియన్‌లో ప్రారంభం

Advertisement
 
Advertisement
 
Advertisement