కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి | Sakshi
Sakshi News home page

కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

Published Thu, Apr 18 2024 9:50 AM

- - Sakshi

బయ్యారం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఇప్టూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ అన్నారు. బయ్యారంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్‌ పరం చేయడంతో పాటు కార్మికుల పని గంటలను పెంచి మోదీ ప్రభుత్వం కార్మిక ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు ఎండగడుతూ మేడేను కార్మికులు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు సీతారామయ్య, అనురాధ, రాసుద్దీన్‌, శివబాబు, రాజేంధర్‌, రామన్న, విశ్వనాథం, వీరభద్రం, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నిబంధనలు

అమలు చేయాలి

మహబూబాబాద్‌: ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్‌ పత్రాలు స్వీకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అదనపు ఎన్నికల అధికారులు లోకేష్‌కుమార్‌, సర్ఫరాజ్‌అహ్మద్‌తో కలిసి జిల్లాల కలెక్టర్లతో నామినేషన్‌ పత్రాల స్వీకరణ, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ.. నామినేషన్‌ ప్రక్రియను ఫొటో, వీడి యో కవరేజ్‌ చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నివేదికలను త్వరగా పూర్తి చేయాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై ఆర్వోలు దృష్టి పెట్టాలన్నారు. సీ–విజిల్‌ కేసులను నిర్ణీత సమయంలో త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. వీసీలో కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌, అదనపు కలెక్టర్లు డేవిడ్‌, లెనిన్‌ వత్సల్‌ టొప్పో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రాములోరి సేవలో

ముస్లిం భక్తుడు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన రాములోరి కల్యాణంలో ఓ ముస్లిం భక్తుడు పాల్గొని మతసామరస్యాన్ని చాటుకున్నాడు. సుశ్రుత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించగా కేసముద్రం మండలానికి చెందిన ఖాసీం అనే ముస్లిం భక్తుడు పాల్గొని పూజలు చేశాడు. వేద పండితుల ప్రవచనాల మధ్యఆయన స్వామివారు, అమ్మవార్ల పూజా కార్యక్రమంలో కూర్చుని కంకణం ధరించి, పసుపుకుంకుమలు సమర్పించాడు. ఇది చూసిన ప్రజలు ఖాసీం పూజలు మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు.

దాంపత్య జీవితాన్ని

సంతోషంగా గడపాలి

గూడూరు: సీతారాముల్లా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగితేనే ప్రతి ఒక్కరి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని ప్రముఖ ప్రవచకులు, పద్మశ్రీ అవార్డు గ్రిహీత గరికపాటి నర్సింహారావు అన్నారు. మండలంలోని మధనాపురం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకొని ఆలయ ధర్మకర్త లింగాల రాధిక సుధీర్‌రెడ్డి దంపతులు ధార్మిక సమావేశం నిర్వహించారు. గరికపాటి హాజరై సీతాస్వయంవరం, వనవాసయాత్ర, దాంపత్య జీవనం గురించి ప్రవచనం చేశారు. నాడు వనవాసంలో సీతాదేవి రాముడిని ఎలా అనుసరించారో.. ప్రస్తుత సమాజంలో భార్యభర్తలు ఒకే మాటపై నిలబడితే జీవితం ఆనందంగా ఉంటుందన్నా రు. అదేవిధంగా ప్రభుత్వ పాలన కూడా రామరాజ్య పాలనలా ఉండాలన్నారు. ఉచితాల పేరుతో ప్రజల నెత్తిన భారం మోపొద్దన్నారు. నాడు రాముడి పాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో.. నేడు ఏ పార్టీ పాలనలోనైనా ప్రజలు అంతే ఆనందంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement