ప్రజలందరిపై క్రీస్తు అనుగ్రహం ఉండాలి | Sakshi
Sakshi News home page

ప్రజలందరిపై క్రీస్తు అనుగ్రహం ఉండాలి

Published Mon, Dec 18 2023 1:00 AM

బంజారా క్రిస్మస్‌ వేడుకలకు హాజరైన భక్తులు  - Sakshi

మహబూబాబాద్‌ రూరల్‌: క్రీస్తు జననం అందరిని ఐక్యపరచడానికి జరిగిందని, ప్రజలందరిపై క్రీస్తు అనుగ్రహం ఉండాలని వరంగల్‌ క్యాథలిక్‌ పీఠాధిపతి మహాఘన బిషప్‌ ఉడుముల బాల అన్నారు. మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారులోని యేసుగుట్ట వద్ద మేరీమాత పుణ్యక్షేత్రం ఆవరణలో బంజారా క్రిస్మస్‌ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మొదటగా మేరీమాత విగ్రహాన్ని శోభాయమానంగా అలంకరించి శనిగపురం గ్రామం నుంచి ఏసుగుట్ట వద్దకు క్రీస్తు ఆరాధనలతో కనుల పండువగా ర్యాలీ చేస్తూ తీసుకువచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భక్తులను ఉద్దేశించి ఉడుముల బాల మాట్లాడారు. అందరికి ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ప్రేమ, కరుణ, దయ ఏసుక్రీస్తు నిర్ణయమని, రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. మూఢనమ్మకాలను విశ్వసించొద్దని, భగవంతుడిని నమ్ముకున్న వారికి ఎలాంటి నష్టం చేకూరదన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సువార్త బోధనలతో అందరి మేలు కోసం కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 50 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, సైకిళ్లు, నిత్యావసర వస్తువులు, క్రిస్మస్‌ పండుగ సామగ్రి అందించామని తెలిపారు. 2024లో ప్రతి ఒక్కరికి దేవుడి అనుగ్రహం ఉండాలని వేడుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఖమ్మం, మహబూబాబాద్‌ ప్రాంత విచారణ గురువులు ఫాదర్లు ఫ్రాన్సిస్‌, పాల్‌ రాజ్‌, పీటర్‌, సైమన్‌, జోసెఫ్‌, కిరణ్‌, లుల్లు, కిషోర్‌, జాన్‌ పాల్‌, మహబూబాబాద్‌, ఈదులపూసలపల్లి, నెల్లికుదురు, బలపాల, కేసముద్రం గ్రామాల నుంచి క్రైస్తవులు పాల్గొన్నారు.

బిషప్‌ ఉడుముల బాల

మాట్లాడుతున్న ఉడుముల బాల
1/1

మాట్లాడుతున్న ఉడుముల బాల

Advertisement
 
Advertisement
 
Advertisement