బైకులకు నిప్పు | - | Sakshi
Sakshi News home page

బైకులకు నిప్పు

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

ఆదోని అర్బన్‌: పట్టణంలోని వసంత టాకీస్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రెండు బైకులకు నిప్పు పెట్టి పరారయ్యాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని వసంత టాకీస్‌ సమీపంలో కిషోర్‌ అనే వ్యక్తి ఇంటి ముందు రెండు బైకులు నిలిపి ఉంచారు. బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఓ వ్యక్తి వచ్చి బైక్‌లకు నిప్పు పెట్టాడు. మంటలు చెలరేగడంతో వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. మంటలను గమనించిన స్థానికులు బైకు యజమానిని లేపారు. మంటలో ఒక బైక్‌ పూర్తిగా దహనం కాగా, మరో బైకు సగభాగం కాలిపోయింది. ఘటనపై వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించి వెళ్లారని బైకు యజమాని కిషోర్‌ తెలిపారు.

ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు

ఒకరికి తీవ్ర గాయాలు

చాగలమర్రి: మండలంలోని చిన్నబోధనం గ్రామ సమీపంలో 40వ నంబరు జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాదు నుంచి పాండిచ్చేరికి వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు బుధవారం తెల్లవారుజామున రాంపల్లె నుంచి చిన్నబోధనం గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ట్రాక్టర్‌ను అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఓబులేసు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ ఓబులేసును టోల్‌ప్లాజా అంబులెన్సులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులోని వారికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పొగాకు ఉత్పత్తులతో ఫ్లోరోసిస్‌ ముప్పు

కర్నూలు(హాస్పిటల్‌): బీడీ, చుట్టా, సిగరెట్‌, జరదా, తంబాకు, పాన్‌ మసాలా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు వాడితే ఫ్లోరోసిస్‌ వ్యాధి సమస్యలు వస్తాయని ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌ చెప్పారు. బుధవారం నగర శివారులోని ప్రజానగర్‌లో ఉన్న ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లో నిర్వహించిన సంచార చికిత్స కార్యక్రమంలో ఆయన ఫ్లోరోసిస్‌పై అవగాహన కల్పించారు. అధిక స్థాయిలో ఫ్లోరైడ్‌ కలిగిన ఆహార పదార్థాలు, నీరు తీసుకోవడం వల్ల ఫ్లోరోసిస్‌ వ్యాధికి గురవుతారన్నారు. దీనివల్ల వికారం, వాంతులు, ఆకలి మందగించడం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, దంతాల రంగు మారడం, తరచూ మూత్రం రావడం, అధికంగా దాహం వేయడం, కండరాలు, కీళ్ల నొప్పులు, ఎక్కువగా నడవలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఫ్లోరోసిస్‌కు గురైన వారు తాజా ఆకుకూరలు, పాలపదార్థాలు, తాజా పండ్లు, విటమిన్‌–సి ఉన్న ఆహార పదార్థాలు (ద్రాక్ష, ఉసిరి, నిమ్మకాయలు) తప్పకుండా తీసుకోవాలన్నారు. ఎక్కువగా మరగకాచిన టీ, కాఫీ, డికాషన్‌ తీసుకోవడం వల్ల కూడా ఫ్లోరోసిస్‌కు గురవుతారని తెలిపారు. వైద్యులు నందిని, క్షేత్రస్థాయి పర్యవేక్షకులు ఎస్తేర్‌ రాణి, సామాజిక ఆరోగ్య అధికారులు అనిత, మహేశ్వరి, ఆశా కార్యకర్తలు, జమృత్‌, భారతి, ప్రొజెక్షనిస్టు ఖలీల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement