గ్యాస్‌ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

రేకుల షెడ్డులో చెలరేగుతున్న మంటలు

కాలిపోయిన సామగ్రిని చూస్తున్న కార్మికులు

మంత్రాలయం రూరల్‌: మండల కేంద్రంలో బుధవారం ఉదయం 11.40 గంటల సమయంలో మాధవరం రోడ్డులోని శ్రీమఠం నరహరి తీర్థ వసతి గృహం పక్కన రేకుల షెడ్డులో 3 చిన్న గ్యాస్‌ సిలిండర్లు (ఒక్కోటి 2 కేజీలు) పేలాయి. వివరాలు.. శ్రీమఠం భవనాల్లో పనులు చేసేందుకు వచ్చిన యూపీ, బీహార్‌కు చెందిన దాదాపు 50 మంది కూలీలు ఇక్కడి షెడ్లలో ఉంటున్నారు. బుధవారం వీరందరూ పనులకు వెళ్లిన సమయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చని సీఐ, ఎస్‌ఐ తెలిపారు. కార్మికులందరూ ఉదయాన్నే పనులకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ప్రమాదంలో దుస్తులు, బియ్యం, పెయింటింగ్‌ మిషన్‌, వంట సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న సీఐ దస్తగిరిబాబు, ఎస్‌ఐ మల్లికార్జున ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపు కర్ణాటక గెస్ట్‌హౌస్‌లోని బోరుతో మంటలను అదుపు చేశారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా ఆర్పివేశారు. హెచ్‌పీ గ్యాస్‌ సిబ్బంది ఘటనా స్థలంలోని 15 కేజీల సిలిండర్‌కు మంటలు వ్యాప్తించకుండా సకాలంలో బయటకు తీసుకొచ్చారు. అలాగే బాధితులకు సీఐ చేతుల మీదుగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు.

బాధితులకు సాయం అందిస్తాం:

పీఠాధిపతి

ప్రమాద సమాచారం తెలుసుకున్న శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. శ్రీమఠం పనికి వచ్చిన కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. బాధితులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని శ్రీమఠం అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో శ్రీమఠం క్వార్టర్స్‌ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మఠం మేనేజర్‌ ఎస్‌కె.శ్రీనివాసరావు, ఇంజినీర్‌ సురేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement