కోడుమూరు రూరల్: స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా ప్రజలంతా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జెడ్పీ సీఈఓ రమణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కోడుమూరులో నిర్వహిస్తున్న స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీఎల్‌డీఓ ఆశ్వినికుమార్ పరిశీలించి పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలిచ్చారు. జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు సకాలంలో వీధులను శుభ్రం చేయడంతో పాటు, ఇంటింటి నుంచి చెత్తను సేకరించి చెత్త నుంచి తయారీ కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు కూడా తమ వద్ద వేస్ట్ పొడి చెత్త, పాత పుస్తకాలు, అట్టపెట్టెలు, ఇనుము, ప్లాస్టిక్ బాటిళ్లను స్వచ్ఛ రథంలో అప్పగించి పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు. అనంతరం సీఈఓ కోడుమూరులో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని తనిఖీ చేసి త్వరితగతిన మ్యాపు చేయబడిన సర్వేను పూర్తి చేయాలని ఎనుమరేటర్లకు సూచించారు. అలాగే మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సీఈఓ సందర్శించారు. కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని, చెత్తను ఉపయోగించి వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేయాలని ఎంపీడీఓ రాముడుకు సూచించారు. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


