కర్నూలు(టౌన్): ‘జిల్లాలో టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే నంద్యాలలో కొత్తపల్లి సుబ్బరాయుడు, ఆలూరు నియోజకవర్గంలో బండారి ఈరన్న దారుణంగా హత్యకు గురయ్యారు. కర్నూలు నగర యువజన విభాగం అధ్యక్షులు బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా పోలీసులు వేధించారు. పోలీసుల వేధింపులను నిరసిస్తూ గురువారం కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ధర్నాలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పాల్గొంటారన్నారు. బుధవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్‌కు పోలీసు డిపార్ట్‌మెంట్ దాసోహం అయ్యిందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసు లు పెట్టి వేధించడం పనిగా పెట్టుకున్నారన్నారు. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసినా కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కర్నూలు 10 వార్డు కార్పొరేటర్ షేక్ యూనుస్ బాషా కార్యాలయంపై మంత్రి అనుచరులు దాడి చేసి ధ్వంసం చేస్తే.. ఈ ఘటనలో బాధితుడి మీదనే హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు సైతం పోలీసులను పంపుతు ండటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
రెండేళ్లు భరించాం.. సహనం నశించింది!
‘అధికార పార్టీ వేధింపులు, దౌర్జన్యాలు రెండేళ్లు చూశాం.. సహనం నశించింది.. ఇక పోరాటం ఎంచుకున్నాం’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదదన్నారు. అవసరమైతే జైళ్లకు సైతం వెళ్లేందుకు వెనుకాడమన్నారు. కర్నూలు యువజన విభాగం నగర అధ్యక్షులు బాలాంజనేయులు ఆలియాస్ బాలు వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్టు అని, వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేస్తున్నాడని ఆయన కారులో సారా ఉందని అక్రమ కేసు పెట్టారన్నారు. వారం క్రితం పోలీసుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీరామనగర్‌లో ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్ మృతికి ముందు లేఖలో రాసినా ఎటువంటి చర్యలు లేవన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో బలంగా పనిచేసే నాయకులు, కార్యకర్తలను టీడీపీ నాయ కులు టార్గెట్ చేసి పోలీసులు ద్వారా వేధించడంతో పాటు, అక్రమ కేసులకు పాల్పడుతున్నారన్నారు. సమావేశంలో పార్టీ సీఈసీ సభ్యులు రాంపుల్లయ్య యాదవ్, గడ్డం రామకృష్ణ, షరీఫ్, కిషన్, శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్, మాజీ కార్పొరేటర్లు కృష్ణకాంత్ రెడ్డి, షేక్ యూనుస్ బాషా, షాషావలీ, సాయి పాల్గొన్నారు.
మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట
నేడు మహా ధర్నా
పాల్గొననున్న యువజన రాష్ట్ర అధ్యక్షులు
జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్దార్థరెడ్డి
భారీగా తరలి రావాలని
వైఎస్సార్‌సీపీ యువజన,
విద్యార్థి నాయకులకు పిలుపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి


