కర్నూలు టౌన్: నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో ఈనెల 15, 16 తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ మేళా నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనధికారిక లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్లాట్లకు పూర్తి చట్టబద్ధత లభిస్తుందని, భవిష్యత్తులో రిజిస్ట్రేషన్, భవన నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు, ఆస్తి బదలాయింపు వంటి ప్రక్రియలు సులభమవుతాయన్నారు.
గృహ నిర్మాణ సమస్యలపై కాల్ చేయండి
కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు తమ సమస్యలు, సందేహాలను నివృత్తికి ఈ నెల 14న 08518– 257481 నెంబర్‌కు ఉదయం 10 నుంచి 11 గంటల్లోపు కాల్ చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన సిమెంట్, స్టీల్ తదితర గృహ నిర్మాణ సామగ్రి, బిల్లుల గురించి ఫోన్ చేసి తెలుసుకోవచ్చ న్నారు. అలాగే పీఎంఏవై 2.0 అర్బన్ గృహాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సంప్రదించాలని పేర్కొన్నారు.
డీఈఓ వెబ్‌సైట్‌లో సీనియారిటీ జాబితాలు
కర్నూలు సిటీ: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, సెకండ్ గ్రేడ్ టీచర్లు, తత్సమాన టీచర్లందరి తుది సీనియారిటీ జాబితాలను డీఈఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఎల్.సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టులతో సహా జాబితాలను రూపొందించామన్నారు. ఈ జాబితాలను www.deokrnl13.blogspot.com అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19 లోపు (పని దినాల్లో మాత్రమే) డీఈఓ కర్నూలు (ఉమ్మడి జిల్లా) ఆఫీస్‌లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు తగిన ఆధారాలతో సమర్పించవచ్చన్నారు. గడువు తరువాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని పేర్కొన్నారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ పబ్లిక్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 57 కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షలకు 15,834 మంది జనరల్ విద్యార్థులు, 1,815 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరవుతారన్నారు. రెండో సంవత్సరానికి 7,374 మంది జనరల్ విద్యార్థులు, 775 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కేంద్రాలకు అనువుగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ సి.వెంకటనారాయణమ్మ, ఆర్‌ఐఓ లాలెప్ప, కర్నూలు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కృష్ణ, కార్మిక శాఖాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పాలనలో మోదీ విఫలం
● సీపీఐ జాతీయ కార్యదర్శి అన్నె రాజా
పత్తికొండ రూరల్: విశ్వగురువుగా ప్రచారం చేసుకునే నరేంద్రమోదీ దేశ ఆర్థిక, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అసమర్థుడుని, పాలనలో ఘోరంగా విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శిఏ. రాజా విమర్శించారు. బుధవారం కర్నూలులో ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు, మధ్యతరగతి వర్గాల వారందరూ మోదీ అవలంబిస్తున్న విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మోదీ వెన్నెముక లేని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు, మతోన్మాదంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రలు చేపడుతామని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.


