‘నీట్’ రద్దుతో విద్యార్థుల ఆందోళన
కర్నూలు సిటీ: వైద్య విద్యను అభ్యసించాలనేది ఎంతో మంది విద్యార్థుల కల. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడుతున్న విద్యార్థులు కోకొల్లలు. ఆ దిశగా తొలి అడుగు వేస్తున్న తీరుణంలో నీట్ రద్దు వార్త విద్యార్థులను కన్నీళ్లు పెట్టిస్తోంది. రాజస్థాన్‌లో పేపర్ లీక్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈనెల 3న నిర్వహించిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ–2026 రద్దయింది. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పించిన తల్లిదండ్రులు ఈ వార్తతో ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు మంచి మార్కులు వస్తాయని, ఇక వైద్య విద్యను అభ్యసించవచ్చని ఎంతో ఆశతో ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెలువడిన రద్దు వార్త విద్యార్థుల కళ్లలో కన్నీటి సుడికి కారణమైంది. మళ్లీ ఆ స్థాయిలో పరీక్ష రాస్తామో, లేదోనని ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్ పరీక్షకు కర్నూలులో 16 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 4,928 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,807 మంది హాజరయ్యారు.
మా అబ్బాయి గత నెల 3న జాతీయ స్థాయిలో జరిగిన నీట్ యూజీ–2026 ప్రవేశ పరీక్ష రాశారు. మంచి మార్కులు వస్తాయని అనుకుంటున్న సమయంలో రాజస్థాన్‌లో నీట్ ప్రశ్నపత్రం లీకై ందని ఎన్‌టీఏ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసింది. ఈ పరిస్థితుల్లో పరీక్ష రాసిన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా కాకుండా ఎక్కడైతే నీట్ ప్రశ్నపత్రం లీకై ందని తెలుస్తుందో అక్కడ మాత్రమే రద్దు చేస్తే బాగుంటుంది. – డా.చైతన్య కుమార్,
గుండె వైద్య నిపుణులు, విద్యార్థి తండ్రి
నీట్ పరీక్షకు కష్టపడి సిద్ధమయ్యాను. పరీక్ష రాసిన ఆనందం ఎన్నో రోజులు నిలువలేదు. నేను అనుకున్న మార్కులు సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇక వైద్య విద్యను అభ్యసించవచ్చని ఆశించా. ఇప్పుడు పేపర్ లీక్ అయిందని పరీక్ష రద్దు చేయడం తెలిసి చాలా బాధ కలుగుతోంది. రీ ఎగ్జామ్‌లో పేపర్ ఎలా వస్తుందో తెలియదు. అమ్మానాన్న ధైర్యం చెబుతున్నా కోలుకోలేకపోతున్నా. – పి.ప్రవళ్లిక, బోడబండ,
ఎమ్మిగనూరు మండలం
మా కుమార్తె సిరిసౌమ్య ఎంతో కష్టపడి చదివి నీట్ పరీక్ష రాసింది. రాజస్థాన్‌లో పేపర్ లీకై ందని పరీక్షను రద్దు చేయడంతో ఎంతో మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురైయ్యే అవకాశం ఉంది. మొదటిసారి పరీక్ష రాసినంత ఉత్సాహం రెండోసారి ఉండదు. ఒత్తిడికి లోనవుతారు. పరీక్ష రద్దు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే.
– బోరెల్లి సోమన్న, కోడుమూరు
మా అమ్మాయి షేక్ యాస్మిన్ మెడిసిన్ చేయాలనే లక్ష్యంతో నెలల తరబడి చాలా కష్టపడి చదివి నీట్ పరీక్ష రాసింది. మంచి మార్కులు వస్తాయనే నమ్మకంతో సంతోషంగా ఉన్న సమయంలో పరీక్ష రద్దు అని ప్రకటించడం చాలా బాధాకరం. ప్రభుత్వాలు గతంలో లీక్ అయిన సమయంలో కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
– అబ్బాస్, పెరవలి గ్రామం మద్దికెర మండలం
పరీక్ష బాగా రాశామని
చాలా మందిలో సంతోషం
వైద్య విద్యను అభ్యసించేందుకు
నిరీక్షణ
ఫలితాల కోసం ఎదురుచూస్తున్న
తల్లిదండ్రులు
నిరాశ కలిగించిన పరీక్ష రద్దు
మళ్లీ ఆ స్థాయిలో రాయగలమో
లేదోనన్న సంశయం


