బనగానపల్లె: మండలంలోని నందవరం చౌడేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న కోనేటిలో మంగళవారం నడిగంటి బాలనరసింహుడు (43) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. వివరాలు.. వైఎస్సార్ కడప పట్టణంలోని అంగన్ వీధిలో నివసించే బాల నరసింహుడు మొక్కుబడి తీర్చుకునేందుకు కుటుంబంతో సహా చౌడేశ్వరి ఆలయానికి వచ్చారు. కోనేటిలో దిగి కాళ్లు, ముఖం శుభ్రం చేసుకుంటుండగా ప్రమాద వశాత్తు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో కాపాడేందుకు ఎవరూ లేకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. కొంత సేపటికి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు కోనేటిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


