మహానంది: నంద్యాల – గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులో శనివారం పెద్ద ప్రమాదం తప్పింది. పాత బొగద రైల్వే వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. రోడ్డుపై లారీ బోల్తా పడటంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డుగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించడంతో వాహ నాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ప్యాపిలి: ఊటకొండ గ్రామానికి చెందిన రామాంజనేయులు (47) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. రామాంజనేయులు తన పొలంలో మోటార్ ఆన్ కాకపోవడంతో డీపీ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రాజమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జలదుర్గం ఎస్‌ఐ అనిల్ కుమార్ తెలిపారు.
వివాహిత అదృశ్యం
ఉయ్యాలవాడ: ఆర్.పాంపల్లెకు చెందిన లీలావతి (27) రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. ఉయ్యాలవాడ పీఎస్ ఏఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపి న వివరాల మేరకు.. ఆర్. పాపంల్లె గ్రామానికి చెందిన కళ్యాణ్‌బాబు, లీలా వతి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఈ నెల 8వ తేదీ ఉదయం ఇంటి నుంచి లీలావతి తన కుమార్తెను వెంట తీసుకుని వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం బంధువులు, భర్త గాలించారు. ఆచూకీ లేకపోవడంతో లీలా వతి తండ్రి రొక్కం ఏసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.


