● ఆరుగురికి గాయాలు
గోస్పాడు: కర్నూలు – కడప జాతీయ రహదారిపై సాంబవరం మెట్ట సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి అరుణాచలానికి వెళ్తున్న జగన్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అమరేంద్రగౌడ్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపటంతో వేగాన్ని నియంత్రించుకోలేక సాంబవరం మెట్ట సమీపంలో అదుపు తప్పి బోల్తా పడి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో 39 మంది ఉండగా ప్రయాణికులు వినయ్‌కుమార్, ఎల్లారెడ్డి, నాగేంద్రమ్మ, జ్యోతి, బాలనర్సమ్మ, ఇందిరారాణి తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగేంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
భార్య హత్య కేసులో
భర్త అరెస్టు
కృష్ణగిరి: మద్యం మత్తులో ఈ నెల 5న బోయ బొంతిరాళ్ల గ్రామంలో భార్య పద్మావతి అలియాస్ సుజాతను గొడ్డలితో హత్య చేసిన భర్త పాపారాయుడును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు సంబంధించిన వివరాలను సీఐ యుగంధర్, ఎస్‌ఐ కృష్ణమూర్తి వెల్లడించారు. ఇతనికి ఆరోగ్యం బాగా లేదని కొంత కాలంగా భార్య సుజాత దాంపత్య జీవితానికి దూరంగా ఉంచింది. దీంతో ఆమైపె అనుమానం పెంచుకుని గొడవ పడి గొడ్డలితో దాడి చేసినట్లు విచారణ వెల్లడైందన్నారు. నిందితుడు ముందుగా ఆలంకొండ వీఆర్వో అనిల్ వద్ద లొంగిపోగా అతన్ని పోలీసులకు అప్పగించారన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు.


