నంద్యాల (అర్బన్): చదువులమ్మ చెట్టు నీడలో విద్యాబుద్ధులు నేర్చుకున్న స్నేహితులందరూ మూడు దశబ్దాల తర్వాత తిరిగి అక్కడే జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇందుకు నంద్యాల మండలం చాపిరేవుల జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం వేదికై ంది. స్థానిక ఉన్నత పాఠశాలలో 1995–96 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 30 ఏళ్ల అనంతరం శనివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. తొలుత సభా వేదిక పైకి వెళ్లి ఒక్కొక్కరిగా పరిచయం చేసుకున్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు, అల్లర్లు, నిక్‌నెమ్‌లు గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ చిన్న పిల్లల్లా మారిపోయి ఉత్సాహంగా గడిపారు. ఆత్మీయ పలకరింపులతో యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా సందడి చేశారు. వివిధ వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలి వచ్చారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామని, తోటి విద్యార్థులకు సాయపడదామని తీర్మానాలు చేసుకున్నారు. విద్యార్థులందరూ వినోద కార్యక్రమాల్లో పాల్గొని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి రూ.60వేలు బహూకరించారు. తోటి విద్యార్థి నరసింహారెడ్డి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడటంతో అతనికి రూ.30 వేలు ఆర్థిక సాయం చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్చిన గురువులు, పీఈటీలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జిల్లెల్ల సరస్వతి, వాసుదేవరెడ్డి, మల్లికార్జునరెడ్డి, వెంకటసుబ్బయ్య, అరుణ, శివపార్వతి, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.


