సుపరిపాలన అంటే అరాచకం.. దౌర్జన్యమా? | - | Sakshi
Sakshi News home page

సుపరిపాలన అంటే అరాచకం.. దౌర్జన్యమా?

May 9 2026 9:49 AM | Updated on May 9 2026 9:49 AM

● కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

దేవనకొండ: టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డూ అదుపులేకుండా దౌర్జన్యాలు చేయడం.. అరాచకాలకు పాల్పడటం.. ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను వేధించడం... ఇదేనా సుపరిపాలన అంటే అని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు. దేవనకొండలో తాళా లు వేసిన ఉపాధి హామీ కార్యాలయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. కార్యాలయానికి ఎందుకు తాళం వేశారని డ్వామా పీడీతో ఫోన్‌లో ఎమ్మెల్యే మా ట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేవనకొండ మండలంలోని మాచాపురం, నెల్లిబండ, దేవనకొండ గ్రామాల ఫీల్డ్‌ అసిస్టెంట్లను బలవంతంగా రాజీనామా చేయాలని, ఉపాధి హామీ సిబ్బంది వారిని రాజీనామా చేసేలా టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారన్నారు. ఉపాధి హామీ సిబ్బందిని నానా దుర్భాషలాడుతూ ఇబ్బందులుకు గురి చేస్తున్నారన్నారు. గత మూడు రోజుల నుంచి సిబ్బంది పనిచేసే కార్యాలయానికి టీడీపీ నాయకులు తాళం వేసుకుని వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులనే టార్గెట్‌ చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా వేధించడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. ఇలాంటి అరాచకాలు ఇంకోసారి తన నియోజకవర్గంలో జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. తనను నమ్మి ఓటు వేసిన ఆలూరు నియోజకవర్గ ప్రజల వెనక తాను నిలబడి పోరాడతానని తెలిపారు. ‘ఉపాధి’ సిబ్బందికి అండగా ఉంటానని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనని సంప్రదించాలని సూచించారు. కార్యాలయానికి వచ్చి ప్రశాంతంగా పని చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వచ్చిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వెళ్లిన ఒక గంటలోపే తాళాలను ఇచ్చి కార్యాలయాన్ని తెరిపించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ రామకృష్ణ, దివాకర్‌నాయుడు, ఎర్రగోటి అంజి, మండలంలోని కార్యకర్తలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement