మొక్కజొన్న రూ.2,400లతో కొనుగోలు చేయాలి
కర్నూలు(సెంట్రల్): మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400 వర్తింపజేయాలని ట్రేడర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ పంటలకు సంబంధించి ట్రేడర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వకపోతే తీవ్ర చర్యలు తప్పవన్నారు. రైతులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖాధికారులను ఆదేశించారు. తూకాల్లో రైతులను మోసం చేస్తే ట్రేడ్ లైసెన్స్‌లను రద్దు చేయాలన్నారు. లారీ అసోసియేషన్ రవాణా ధరలను పెంచడంతో కొంత సమస్య ఉందని, దానిని పరిష్కరించాలని ట్రేడర్లు కోరారు. సమావేశంలో జేసీ నూరుల్ ఖమర్, డీఏఓ పీఎల్ వరలక్ష్మీ, ఎల్‌డీఎం రామచంద్రరావు, ఉద్యాన అధికారి రాజకృష్ణారెడ్డి, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ సెక్రటరీ జయలక్ష్మి పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి


