పదిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి
కోడుమూరు రూరల్: పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ శామ్యూల్‌పాల్ సూచించారు. శనివారం ఆయన కోడుమూరులోని బాలురు, బాలికల హైస్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలో పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడారు. డీఈఓ ఆయా సబ్జెక్టుల్లోని ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి స్వయంగా సమాధానాలు రాబట్టారు. డీఈఓ మాట్లాడు తూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఆయా హైస్కూళ్లలో ఉపాధ్యాయులంతా పదవ తరగతి విద్యార్థులకు ప్రతి రోజు ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా సైన్స్, మ్యా థ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసి ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు అల్పాహా రం అందివ్వాలన్నారు. కార్యక్రమంలో బాలురు, బాలికల హైస్కూళ్ల హెచ్‌ఎంలు రామచంద్రుడు, ఇంద్రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో ఐదుగురికి పార్టీ పదవులు
కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయిలో ఒకరికి, నియోజకవర్గ స్థాయిల్లో నలుగురికి పార్టీ పదవులు దక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కళాకారుల విభాగం జిల్లా అధ్యక్షులుగా కనికె మల్లిఖార్జున (ఎమ్మిగనూరు) నియమితులయ్యారు. అలాగే వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షులుగా బి.పి.శోభలతా(ఆదోని), వి.సురేష్ బాబు(ఆలూరు), సురేంద్ర రెడ్డి(కోడుమూరు), ఎల్. నెట్టికల్(పత్తికొడ) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
డిగ్రీ పరీక్షలకు 93 శాతం హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో 93 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా శనివారం జరిగిన పరీక్షలకు 6,677 మందికి 6,232 మంది హాజరు కాగా 445 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు శ్రీ సాయికృష్ణ డిగ్రీ కళాశాల, పత్తికొండ విజయసాయి డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున చూచిరాతకు పాల్పడటంతో డిబార్ చేశామన్నారు.
వారం రోజులైనా
అందని వేతనాలు
కర్నూలు(అగ్రికల్చర్): డిసెంబర్ నెల మొదలై ఏడు రోజులు గడిచినా ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థితి. చంద్రబాబు సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని ప్రకటిస్తోంది. అయితే వాస్తవానికి ఆ ప్రకటనల్లో నిజం లేదని ఉద్యోగులే వాపోతున్నారు. అక్టోబర్ 2వ తేదీ విజయదశిమి సందర్భంగా కూడా 1వ తేదీ వేతనాలు చెల్లించలేదు. ఆ నెలలో 7–9 తేదీల్లో వేతనాలు బ్యాంకు ఖాతాలకు జమ అయ్యాయి. నవంబర్ నెలలో 9వ తేదీ నాటికి వేతనాలు చెల్లించారు. డిసెంబర్ నెలలో కూడా వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ, వ్యవసాయం, ఉద్యానశాఖ, జిల్లా ముఖ్య ప్రణాళిక కార్యాలయం, కార్మికశాఖ, ఆర్‌అండ్‌బి, నీటిపారుదల తదితర శాఖల ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదు. కొన్ని శాఖల ఉద్యోగులకు 2, 3 తేదీల్లో వేతనాలు పడ్డాయి. అత్యధిక శాఖల ఉద్యోగులు ఇప్పటికీ వేతనాల కోసం నిరీక్షిస్తుండటం గమనార్హం.


