అంబేడ్కర్ వర్ధంతిని విస్మరించడం అవమానించడమే!
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించడం అవమానించడమే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ 69 వ వర్థంతిని పురస్కరించుకొని శనివారం పాతబస్టాండ్‌లోని విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో టెంకాయ కొట్టి పూలమాలు వేసి నివాళ్లు ఘనంగా అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం, పౌర హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన కృషి అపారమైందన్నారు. ఆయన చూపిన మార్గమే తూచ తప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అమలు చేసిందన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని అని తెలిసి కూడా చంద్రబాబు ప్రభుత్వం కనీసం అంబేడ్కర్ విగ్రహం చుట్టూ శుభ్రం చేయించడంలో విఫలం చెందిందన్నారు. చెత్తాచెదారం నిండి ఉన్నా మున్సిపల్ అధికారులకు కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ ఆశించిన సమానత్వం, సమాజ నిర్మాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రేలంపాడు వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు కమతం పరుశరామ్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైల్వే ప్రసాద్, ఆర్‌టీఐ నగర అధ్యక్షుడు గద్ద రాజశేఖర్, నవీన్, ప్రభుదాస్, చందు, లాయర్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, చెన్న, సత్యరాజు, పార్టీ దళిత నాయకులు పాల్గొన్నారు.


