పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
కర్నూలు: కోర్టులలో పెండింగ్‌లోని మోటర్ యాక్సిడెంట్లు, సివిల్ కేసులు, భూసేకరణ, బ్యాంకు, చిట్‌ఫండ్, చెక్‌బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచించారు. జిల్లాస్థాయిలో డిసెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌పై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో శనివారం సమీక్ష నిర్వహించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఇన్సురెన్స్ న్యాయవాదులు, ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్నూలు డిపో మేనేజర్, బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్స్, భూసేకరణ సంబంధిత అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎక్కువ కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే విధంగా ప్రత్యేక దృష్టి సారించి విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు. కక్షిదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు, డిపో మేనేజర్ సుధారాణి, ఇన్సురెన్స్ న్యాయవాదులు, ఇన్సురెన్స్ అధికారులు, బ్యాంకుల లీడ్ డివిజినల్ మేనేజర్ రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


