పోలీసు ప్రతిష్ట పెంచేలా పనిచేయండి
కర్నూలు: పోలీసు ప్రతిష్టను పెంచేలా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో శనివారం హోంగార్డుల 63వ వ్యవస్థాపక దినోత్సవం(రైజింగ్ డే) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించి పరేడ్ పరిశీలన వాహనంపై మైదానం కలియతిరుగుతూ ప్లటూన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులతో సమానంగా హోంగార్డులు సేవలు అందించడం అభినందనీయమన్నారు. సాధారణ డ్యూటీలు మొదలుకొని క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పోలీసు సిబ్బందితో సమానంగా హోంగార్డుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. హోంగార్డులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్‌లో గెలుపొందిన విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.
నలుగురికి సత్కారం
సుదీర్ఘకాలం హోంగార్డు విభాగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీనివాస శెట్టి, శేషమ్మ, వీరమ్మ, హసీనా బేగం తదితరులను ఎస్పీ శాలువ, పూలమాలలతో సత్కరించి ఒక్కొక్కరికి రూ.2 లక్షల కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులను అందజేశారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, ఉపేంద్ర బాబు, ప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, సీఐలు మధుసూదన్‌రావు, చంద్రబా బు, నాగరాజరావు, మన్సూరుద్దీన్, ఆర్‌ఐలు పోతల రాజు, జావేద్, నారాయణ, ఆర్‌ఎస్‌ఐలు మహేశ్వర రెడ్డి,హుసేన్, ప్రదీప్, కల్పన, మహాలక్ష్మి పాల్గొన్నారు.


