పైళ్లెన నెల రోజులకే..
● యువకుడి బలవన్మరణం
కొలిమిగుండ్ల: వివాహ బంధంతో ఆనందంగా గడపాల్సిన యువకుడికి ఏమైందో ఏమో కానీ పైళ్లెన నెల రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన శనివారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరుకు చెందిన బట్ట జయరాముడు కుమారుడు శరత్‌కుమార్(25)కు కర్ణాటక రాష్ట్రం సుగ్నీల్ కొట్టాలకు చెందిన సుస్మితతో గత నెల 4వ తేదీన వివాహమైంది. శరత్‌కుమార్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం బెంగళూరు వెళ్తూ భార్యను పుట్టింటిలో వదిలిపెట్టాడు. శుక్రవారం బుగ్గకు చేరుకుని కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఉంటున్న స్నేహితుడు హరీష్‌కు ఫోన్ చేసి అక్కడికి వస్తున్నట్లు చెప్పాడు. హరీష్ పెట్నికోట సమీపంలో నిర్మాణంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ప్యాక్టరీలోకి డ్యూటీకి వెళ్లాడు. ఆతర్వాత శరత్ తన భార్యతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. శనగ మాత్రలు మింగి డ్యూటీలో ఉన్న స్నేహితుడికి వాయిస్ మెసేజ్ చేశాడు. దీంతో అక్కడి నుంచి రూంకు చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న మిత్రుడిని తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం అనంతపురం రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు అనంతపురం చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
రైల్వే డబుల్ లేన్ పనుల పరిశీలన
పాణ్యం: నంద్యాల–గుంతకల్లు మధ్య రైల్వే శాఖ చేపట్టిన డబుల్ లేన్ పనులను గుంతకల్లు ఏడీఆర్‌ఎం సుధాకర్ శనివారం పరిశీలించారు. ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్ నుంచి సేఫ్టి అధికారులు పర్యవేక్షణకు వస్తున్న క్రమంలో ముందుస్తుగా ఏడీఆర్‌ఎం, ఇంజినీర్ల బృందం పనులను పరిశీలించేందుకు ప్రత్యేక రైలులో మార్గంలో తనిఖీలు చేపట్టారు. వారికి ఆయా స్టేషన్ మాస్టర్లు, సిబ్బంది స్వాగతం పలికారు. నూతనంగా చేపట్టిన డబుల్ లేన్, విద్యుత్ సరఫరా, బ్రిడ్జిల నిర్మాణం, ఇతర పనులపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ల వారీగా ఇంజినీర్లును అడిగి తెలుసుకున్నారు. పాణ్యం రైల్వే స్టేషన్‌లో చేట్టిన డబుల్ ట్రాక్ పనులకు సంబంధించి సమీక్ష చేపట్టారు.


