దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
● అలేబాదు వద్ద ఆటో బోల్తా
● ఇద్దరు మహిళలు మృతి
ప్యాపిలి: దైవదర్శనం ముగించుకుని ఇంటికి వెళ్తున్న భక్త బృందంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అలేబాద్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు ఈ నెల 4వ తేదీన ఆటో అద్దెకు మాట్లాడుకుని వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి జ్యోతి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. దైవదర్శనం అనంతరం అదే ఆటోలో 5వ తేదీన తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో ప్యాపిలి మండల సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలో దైవదర్శనం చేసుకుని రాత్రి అక్కడే భోజనం చేసి కాసేపు సంతోషంగా గడిపారు. అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. అలేబాదు నుంచి బయలుదేరిన వారి ఆటో వినాయక గుడి మలుపు వద్ద అదుపు తప్పి రక్షణగోడను ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో కళావతి, నాగేంద్రమ్మ (58), బోయ దూది హనుమక్క (66), అయ్యమ్మ, సోమక్క, మద్దమ్మ, లక్ష్మమ్మకు గామాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే రాచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బోయ హనుమక్క ఆసుపత్రికి చేరుకునేలోపే మృతి చెందగా, నాగేంద్రమ్మ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. మృతి చెందిన లింగుట్ల నాగేంద్రమ్మ అవివాహిత కాగా.. హనుమక్క భర్త కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఆమె పుట్టినిల్లు రామకృష్ణాపురంలో ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం. తీవ్రంగా గాయపడిన సోమక్క, అయ్యమ్మలను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బోయ దూది హనుమక్క, నాగేంద్రమ్మ (ఫైల్)
దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..


