ఇచ్చట ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మబడును
● అడ్వాన్స్ ఇవ్వండి..
జాబ్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఇవ్వండి
● నిరుద్యోగులను బురిడీ కొటిస్తున్న
ఓ ఉద్యోగి
ఆత్మకూరురూరల్: భలే మంచి చౌకబేరం.. అంటూ ఆత్మకూరులో ఓ ఘనుడు ప్రభుత్వ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాన ని నిరుద్యోగులను మభ్యపెట్టి అందినకాడికి దోచుకుంటున్నాడు. అందులోనూ అతను ప్రభుత్వ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కావడంతో కొందరు సులువుగా న మ్మి మోసపోతున్నారు. అర్హతను బట్టి రెవెన్యూ, అటవీ వాఖ, ఎండోమెంట్.. ఇలా ఏ శాఖ కావాలో కోరుకో.. అంటూ చెబుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లె మండలాలకు చెందిన నిరుద్యోగులు ఇతని బుట్టలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. అడ్వాన్స్‌గా కొంత ఇచ్చి ఉద్యోగంలో చేరిన తర్వాత మొత్తం ఇచ్చేలా ఒప్పందం అంటూ.. నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాడు. పాములపాడు, బానకచర్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు అటవీ శాఖలో ఉద్యోగం కోసం రూ. లక్ష చొప్పున అతనికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల పేరుతో వ్యాపారం మొదలు పెట్టడంతో బాధితులు ఇంకా రోడ్డున పడలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుంటూ నోటిఫికేషన్ల కోసం ఎంతో మంది యువత ఎదురు చూస్తుంటే ఆత్మకూరులో ఓ ఉద్యోగి మాత్రం జాబ్‌కు ఇంతా.. అంటూ బేరం పెట్టడంపై ఆత్మకూరు లో తీవ్ర చర్చ సాగుతోంది. జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిరుద్యోగులను దోచుకుంటున్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


