పైపులు ధ్వంసం చేసి.. స్టార్టర్ అపహరించి..
● వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడి
పొలంలో దుండగుల దాష్టికం
ఆత్మకూరురూరల్: నల్లకాల్వ గ్రామంలో ఓ రైతు పొలంలో గుర్తు తెలియని అగంతకులు పైపులు ధ్వంసం చేసి స్టార్టర్‌ను ఎత్తుకు పోయారు. వెలుగోడుకు చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడు జనార్దన్ నల్లకాల్వలో కొంత పొలం కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నాడు. కాగా ఈ పొలం విషయంలో కొందరితో ఆయనకు కోర్టులో సివిల్ వాజ్యం ఉంది. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జనార్దన్‌ను కోర్టుతో సంబంధం లేకుండా తమ వద్దకు వచ్చి పంచాయితీ చేసుకోవాలని పదేపదే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ట్రాక్టర్‌తో జనార్దన్ పొలం దున్నించే యత్నం కూడా చేశారు. ఈ అంశం అప్పట్లో పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. కాగా మరో మారు పంచాయితీకి రమ్మని టీడీపీకి చెందిన కొందరు జనార్దన్‌ను పిలిచారు. అయితే కోర్టులో వచ్చే తీర్పును బట్టే తాను నడుచుకుంటానని జనార్దన్ వారితో చెప్పాడు. ఈ నేపధ్యంలో శుక్రవారం రాత్రి జనార్దన్ పొలంలో ఉన్న మోటార్‌కు చెందిన పైపులు ధ్వంసం అయ్యాయి. అంతే కాకుండా విద్యుత్ స్తంభానికి కట్టిన స్టార్టర్ కూడా మాయమైంది. ఉదయం పొలంలో నీరు పెట్టడానికి వెళ్లిన కూలీ జనార్దన్‌కు జరిగిన విషయం తెలిపాడు. దీంతో బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


