విద్యార్థుల భోజనం నాణ్యతలో రాజీపడం
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ, సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అందించే భోఽజనం నాణ్యత విషయంలో రాజీపడమని వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య వెంకట బసవరావు అన్నారు. శనివారం ఆ కాలేజీ తుంగభద్ర హాస్టల్‌లో నూతన డైనింగ్ హాలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తే ఆరోగ్యవంతులై చదువుపై దృష్టి సారిస్తారన్నారు. హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సీనియర్, జూనియర్ విద్యార్థులు అందరు కూడా కలిసిమెలిసి శ్రద్ధగా చదువుకోవాలన్నారు. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హాస్టల్ విద్యార్థుల వసతులు, మెనూ విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వార్డెన్లు అందుబాటులో ఉంటారన్నారు. నిరంతరం సీసీ టీవీ నిఘా ఉంటుందన్నారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్‌లు హాస్టల్‌లోనే భోజనం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ డీన్లు డాక్టర్ నాగరాజు శెట్టి, డాక్టర్ అక్తర్ భాను, డాక్టర్ మహమ్మద్ వాహిజ్, డిప్యూటీ వార్డెన్లు డాక్టర్ ఎం పార్వతి, డాక్టర్ స్వప్నశ్రీ, డాక్టర్ షానవాజ్ బేగం, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.


