సమస్యల పరిష్కారమే లక్ష్యం
వెల్దుర్తి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఆ వేదిక చైర్ పర్సన్, రిటైర్ట్ జడ్జి శ్రీనివాస ఆంజనేయ మూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక విద్యుత్ కార్యాలయంలో కర్నూలు డివిజన్ పరిధిలోని వినియోగదారులకు డీఈ/ఈఈ శేషాద్రి ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు టౌన్, కర్నూలు, కల్లూరు రూరల్, వెల్దుర్తి, కృష్ణగిరి, ఓర్వకల్లు మండలాల వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన కార్యక్రమంలో ఇనుప విద్యుత్ స్తంభాలను మార్చాలంటూ వినియోగదారులు విన్నవించారు. వెల్దుర్తి పట్టణంలో శాశ్వత విద్యుత్ బిల్లుల చెల్లింపు సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. వెల్దుర్తి నుంచి నాలుగు, ఇతర మండలాల నుంచి నాలుగు సమస్యలు వేదిక, అధికారుల ముందుకు రాగా కార్యక్రమానికి హాజరైన కర్నూలు ఎస్‌ఈ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తెలిపిన సమస్యలు, అందించిన నివేదికలపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. బిల్ కలెక్టర్ నియమిస్తామన్న హామీనిచ్చారు. వినియోగదారులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీతో సోలార్ రూఫ్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక ప్రతినిధులు మధుసూదన్, శ్రీనివాసబాబు, విజయలక్ష్మి, ఎస్‌ఏఓ చిన్నరాఘవులు, ఏడీఏ సుబ్బన్న, ఇన్‌ఛార్జ్ ఏఈ వెంకటేశ్వర్లు, కర్నూలు, కల్లూరు సబ్‌డివిజన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


