బాలింత మృతితో బంధువుల ఆందోళన
కోడుమూరు రూరల్: గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి హాస్పిటల్‌లో బాలింత మృతితో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మీ (23)ని సి.బెళగల్ మండలంలోని సింగవరం గ్రామానికి చెందిన రాజుకు ఇచ్చి రెండేళ్ల కిందట పెద్దలు వివాహం చేశారు. కాన్పు కోసం పెంచికలపాడు విశ్వభారతి హాస్పిటల్‌కు వెంకటలక్ష్మి రెండు రోజుల కిందట వెళ్లారు. గురువారం వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయగా ఆడపిల్లకు జన్మనిచ్చారు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన వెంకటలక్ష్మి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే వెంకటలక్ష్మి మృతిచెందిదంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న తాలూకా సీఐ చంద్రబాబు, కె.నాగలాపురం ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి పోలీస్ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల ఆందోళనను విరమింపజేశారు.


